కిడ్నీ వ్యాది మూలాలపై పరిశోధన
ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుతో తక్షణ వైద్యం
పవన్ దీక్షపై ట్విట్టర్‌లో స్పందించిన బాబు
అమరావతి,మే26(జనంసాక్షి): క్రానిక్ కిడ్నీ వ్యాధుల మూలాల్ని కనుగొనుటకు పరిశోధన మొదలైందని ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పవన్ దీక్షపై స్పందించిన ఆయన ఉద్దానం ప్రాంతంలోని 18 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య అధికారులకు సంబంధిత శిక్షణను అందిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో ఏఎన్‌ఎం, ఆశా, అంగన్వాడీ, సాధికార మిత్రలతో గ్రామ స్ధాయి కమిటీని నియమించి అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి దగ్గరలోనే డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యాన్ని చేరువ చేస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం రిమ్స్‌లో 16, టెక్కలి ఏరియా ఆసుపత్రిలో 8, పాలకొండ ఏరియా ఆసుపత్రిలో 5, పలాస సామాజిక ఆసుపత్రిలో 8, సోంపేట సామాజిక ఆసుపత్రిలో 12 డయాలిసిస్ మిషన్లను ఏర్పాటు చేసామని తెలిపారు. ఉద్దానం సమస్యపై ప్రత్యేక చొరవతో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గత ఏడాది జనవరి నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉద్దానం 7 మండలాల్లోని 176 గ్రామాల్లో స్క్రీనింగు నిర్వహించి 1,01,593 మందిలో రుగ్మతలను గుర్తించామని చెప్పారు. వారిలో 13,093 మందిని కిడ్నీ సంబంధిత వ్యాధి పరీక్షలకు సిఫారసు చేశారని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచామన్నారు. దేశ, విదేశీ వైద్యులు, పరిశోధకులతో పరీక్షలు నిర్వహించడంతో పాటు మందుల పంపిణీ, డయాలసిస్ చేపట్టామని స్పష్టం చేశారు. నీటి శుద్ధి, మినరల్ వాటర్ కేంద్రాల ఏర్పాటుపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు.