కిడ్నీ వ్యాధిగ్రస్తులకు.. 

ఉచితంగా మందులు పంపిణీ చేయండి
– నూజివీడు ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి
– కిడ్నీ వ్యాధిగ్రస్తులపై సీఎం చంద్రబాబు ఆరా
– వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులకు దిశానిర్దేశం
అమరావతి, మే30(జ‌నం సాక్షి) : కృష్ణా జిల్లా ఎ.కొండూరులో కిడ్నీ వ్యాధుల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బుధవారం ఉదయం తన నివాసం నుంచే అధికారులతో ముఖ్యమంత్రి సవిూక్షించారు. ఇటీవల ఓ వ్యక్తి మృతిపై విూడియాలో వచ్చిన కథనాన్ని సీఎం ప్రస్తావించగా.. గతంలో అతనికి డయాలసిస్‌ జరగలేదని, క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌(సికెడి)తో ఇబ్బంది పడ్డాడని అధికారులు వివరించారు. రెండునెలల క్రితం స్కీన్రింగ్‌లో ఈ సంగతి బయట పడిందని అధికారులు చెప్పారు. 10 వేల రూపాయల చెక్కు మృతుని కుటుంబానికి అందించినట్లు తెలిపారు. ఎ.కొండూరు మండలంలోని 19గ్రామాల్లో పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని సూచించారు. నూజివీడు ఏరియా ఆసుపత్రిలో తక్షణమే డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్దానం, కనిగిరి, ఎ.కొండూరు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి మూడు జిల్లాలలో కిడ్నీవ్యాధుల నియంత్రణపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మూడు జిల్లాలలో ఇప్పటివరకు చేపట్టిన వైద్య సేవలపై వివరించాలని, సికెడి వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న వైద్య సేవలపై నివేదిక ఇవ్వాలని సూచించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. ఎ.కొండూరులో వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని.. ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించాలని, మందులు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు. జూన్‌ 1నుంచి అటుకుల లడ్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. జూన్‌ 3కల్లా డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యానికి తావివ్వద్దని, నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.
———————————-