కిషన్‌జీ అబద్ధాల ప్రచారం తగదు
` భేషరతుగా క్షమాపణ చెప్పండి
` హరీశ్ డిమాండ్
` మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు మొండిచేయి
` ఒక్కటంటే ఒక్క కాలేజీని ఇవ్వని కేంద్రం
` ఎయిమ్స్‌కు బిల్డింగ్ సహా జాగా అప్పగించామని వెల్లడి
హైదరాబాద్,నవంబరు 11(జనంసాక్షి): హైదరాబాద్: భాజపా నేతలు సోషల్ విూడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ..కేసీఆర్ కిట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.5వేలు ఇస్తోందని సోషల్ విూడియాలో ప్రచారం చేశారన్నారు. నిరూపించాలని ఛాలెంజ్ చేస్తే ఒక్క భాజపా నాయకుడు కూడా ముందుకు రాలేదన్నారు. సిలిండర్లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వేస్తుందని భాజపా దుష్ప్రచారం చేస్తుందని.. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ విధించడం లేదని స్పష్టం చేశారు.‘‘బీబీనగర్ ఎయిమ్స్‌కు స్థలం ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్విటర్‌లో పోస్టు చేశారు. ఏడాదిన్నర క్రితమే బీబీనగర్‌లో 201 ఎకరాల 24 గుంటల స్థలం, భవనం ఎయిమ్స్ డైరెక్టర్‌కు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అప్పగించింది. కేంద్ర మంత్రిగా ఉండి కిషన్‌రెడ్డి ట్విటర్‌లో అసత్యాలు పోస్టు చేయడం తగదు. అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు కిషన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి. కిషన్‌రెడ్డి సరైన వాళ్లను తన సలహా బృందంలో నియమించుకోవాలి. కేంద్రంలోని భాజపా రాష్ట్ర ప్రజలను చిన్నచూపు చూస్తోంది. కేంద్రం దేశ వ్యాప్తంగా 157 వైద్య కళాశాలలు ఇచ్చింది. కానీ, తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కళాశాల కూడా మంజూరు చేయలేదు. కిషన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వైద్య కళాశాలలు తీసుకురావాలి. బీబీ నగర్ ఎయిమ్స్ మంజూరు చేశామని భాజపా నేతలు చెప్పుకుంటున్నారు. ఎయిమ్స్ మెడికల్ కళాశాల రాష్ట్ర విభజన చట్టంలో హక్కుగా వచ్చింది.మొండి చేయి చూపినా రాష్ట్రంలో కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 21 మెడికల్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 5 నుంచి 21 మెడికల్ కాలేజీలకు చేరుకున్నాం. తెలంగాణకు ఎయిమ్స్ ఇవ్వాలని విభజన చట్టంలో ఉంది. దాన్ని తుంగలో తొక్కారు. గిరిజన వర్సిటీని రాష్ట్రానికి ఇప్పించాలని కిషన్‌రెడ్డిని కోరుతున్నా. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. బీసీల జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కానీ, కేంద్రం నుంచి స్పందన లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఇది ఏర్పాటైతే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గిరిజన యూనివర్సిటీని, నవోదయ విద్యాలయాలను రాష్టాన్రికి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ఎస్సీలపై ప్రేమ ఉంటే ఎస్సీ వర్గీకరణను చేపట్టాలి. బీసీల జనగణన చేయించాలని కిషన్ రెడ్డిని కోరుతున్నాం అని హరీశ్‌రావు అన్నారు. ఇకపోతే వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ నాయకుల ప్రవర్తనను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వడ్లు కొనవద్దని చెప్పింది బీజేపీ పార్టీ.. వడ్లు కొనాలి అని మాట్లాడుతున్నది కూడా బీజేపీ పార్టీనే. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.. సిగ్గుపడుతున్నారు అని మంత్రి తెలిపారు. కేసీఆర్ కిట్‌లో కేంద్రం రూ. 5 వేలు ఇస్తుందని బీజేపీ నాయకులు చెప్తే సవాల్ చేశాను. ఒక్కరూ కూడా రాలేదు. రైతుల నుంచి బీజేపీకి మద్దతు లేదు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తుంది. రాష్టాల్ర హక్కులను అమలు చేయించాలని బీజేపీ నేతలను డిమాండ్ చేస్తున్నాను. ఎన్సీడీసీ కోసం నాలుగైదు స్థలాలను చూపించాం. ఐసీఎమ్‌ఆర్‌లో ఎన్సీడీసీ కోసం మూడు ఎకరాల స్థలం కావాలని అడిగితే కేంద్రం నుంచి స్పందన లేదు అని హరీశ్ రావు పేర్కొన్నారు.