కుంభమేళాకు రాని నేతలను బహిష్కరించాలట!

` కేంద్రమంత్రి రాందాస్‌ ఆఠవలే వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేలపై కేంద్రమంత్రి రాందాస్‌ ఆఠవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ, ఉద్ధవ్‌ ఠాక్రే మహాకుంభమేళాను సందర్శించకుండా హిందూ సమాజాన్ని అవమానపరిచారన్నారు. అందుకుగాను హిందూ ఓటర్లు వారిని బహిష్కరించాలని.. ఎన్నికల్లో వారి పార్టీలకు ఓట్లు వేయొద్దని అన్నారు. తరచూ సమావేశాల్లో హిందుత్వం గురించి మాట్లాడే ఠాక్రే ఈ విధంగా ప్రవర్తించడం సరైన చర్య కాదని మండిపడ్డారు.ఈ విషయంలో వారు కనీసం ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీకి, ఉద్ధవ్‌ ఠాక్రే తగిన గుణపాఠం చెప్పినా వారి తీరులో ఎటువంటి మార్పు లేదని దుయ్యబట్టారు. జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన మహా కుంభమేళా నేటితో ముగియనుంది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో కోట్లాదిమంది భక్తులతో పాటు పలువురు రాజకీయ నేతలు, వ్యాపార, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు.