కుప్వారాలో ఎన్‌కౌంటర్‌..

– ఓ ఉగ్రవాది హతం
– మిగిలిన ఉగ్రవాదుల కోసం ఆపరేషన్‌ కొనసాగిస్తున్న ఆర్మీ
జమ్మూకాశ్మీర్‌, జులై 9(జ‌నం సాక్షి) : జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఆదివారం రాత్రి ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వార వద్ద భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. హంద్వారా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో సైన్యం అక్కడకు చేరుకుంది. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టడంతో సైన్యం ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమై సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఆదివారం రాత్రి మొదలైన ఎన్‌కౌంటర్‌ సోమవారం సాయంత్రం వరకు కొనసాగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో సోమవారం ఉదయం ఓ ఉగ్రవాది హతమవ్వగా, మరికొందరు ఉగ్రవాదులు దాక్కుని ఉండటంతో భద్రతా దళాలు ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి. హతమైన ఉగ్రవాదిని ఇంకా గుర్తించలేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు జమ్మూ కశ్మీర్‌ పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ దళాలు సంయుక్తంగా దాడి చేసి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి 12 కిలోల మాదకద్రవ్యాలు, రెండు ఏకే-56 తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొన్నాయి. ఆదివారం (జులై 8) హిజ్బుల్‌ ముజాయిద్దీన్‌ ఉగ్రవాది బుర్హానీ వనీ రెండో వర్దంతి కావడంతో లోయలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. త్రాల్‌ ప్రాంతంలో కర్ఫ్యూ విధించి, ర్యాలీలను నిషేధించారు.
————————–