*కుమ్మరుల కుల వృత్తికి చేయూత*
*బీసీ కార్పోరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు*
*80 శాతం సబ్సిడీపై అధునాతన పనిముట్లు*
*జిల్లాలో 9 మంది లబ్ధిదారుల ప్రయోజనం*
కుమ్మరుల కుల వృత్తికి చేయూతనందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందించి ఆదుకుంటోంది.
80 శాతం సబ్సిడీపై కుమ్మరులకు అధునాతన పనిముట్లు, యంత్రాల అందించి, ముడి సరుకులు అందించడానికి సిద్ధం అవుతోంది.
ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లాలో
కుమ్మరి వృత్తికళాకారుల జీవన ప్రమాణాలు పెంచటంతోపాటు లబ్దిదారుల ఆర్థిక స్వావలంబన కోసం మోడ్రన్ పాటరీ కిన్లను సబ్సిడీపై అందిస్తున్నది.
శిక్షణ పూర్తి చేసుకొన్న 9 మంది కుమ్మరి వృత్తి కళాకారులకు ఆధునిక పాటరీ యంత్రాలను ఇటీవలే మంజూరు చేసింది.
వీటి కొనుగోలుకయ్యే రూ.లక్ష ఖర్చులో రూ.80 వేలను ప్రభుత్వమే సబ్సిడీగా ఇచ్చింది.
జిల్లాలో సుమారు 5,600 కుమ్మరి కుటుంబాలు ఉన్నట్లు అంచనా.
ఇందులో కొన్ని కుటుంబాలు కుల వృత్తులను చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాయి. మరికొన్ని కుటుంబాలు ప్రత్యామ్నాయ ఉపాధి పొందుతున్నారు. కుండలు, రంజన్‌లు, మట్టి పాత్రలను తయారు చేస్తూ విక్రయిస్తుంటారు. పాత్రల తయారీకి అవసరమైన మట్టితో పాటు ఇతర ముడిసరుకులు, పరికరాల కొరకు డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది.
కొన్ని కుటుంబాలు పెట్టుబడి లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో కుల వృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ద్వారా కుమ్మరి కులస్థులకు స్వయం ఉపాధి రుణాలను అందించడానికి ముందుకు వచ్చింది. కుమ్మరి యువజనులకు రుణాలను అందించడానికి 2018లో జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న తొమ్మిది మందికి
పాతకాలం నాటి పద్ధతులు అనుసరిస్తూ పాత్రలు చేసే కుమ్మరి/శాలివాహన వృత్తిదారులకు ప్రభుత్వం నవీన నైపుణ్యాలు కుమ్మరి కులసంఘాల నాయకులను నాలుగు రోజులపాటు హైదరాబాదులోని రామానందతీర్థ ఇన్స్టిట్యూట్ లో 9 మంది కుమ్మరి వృత్తిదారులకు వివిధ రకాల మట్టిపాత్రల తయారీలో శిక్షణ ఇప్పించారు.
వీరు జిల్లాలో మరింత మందికి శిక్షణ ఇచ్చారు.
వీరంతా మట్టిగణపతులు, దీపాంతలు, మట్టిగ్లాసులు, జగ్గులు, వాటర్ బాటిల్స్ తదితర మట్టిపాత్రల తయారీలో నిష్ణాతులయ్యారు.
తాజాగా అధికారులు రెండో విడత యంత్రాలు అందించేందుకు ధరఖాస్తులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు.
తొలి విడతగా 9 యూనిట్లు మంజూరు
జిల్లాలో తొలి విడతగా 9 యూనిట్లు పంపిణీ చేయడానికి మంజూరు అయ్యాయి. రూ. లక్ష స్వయం ఉపాధి రుణాన్ని అందించనున్నారు. ఇందులో రూ. 80 వేలు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. రూ. 20 వేలను లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానంగా కుమ్మరి కుల వృత్తులకు అవసరమైన పనిముట్లు, ఆధునిక యంత్రాలు, ముడి సరుకును అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టైప్-1, టైప్-2ల వారీగా యూనిట్లను అధికారులు కేటాయిస్తున్నారు. టైప్-1లో రూ. లక్ష విలువ గల అధునాతనంగా తయారు చేసిన పగ్ మిల్ యంత్రం, 100 కేవీ కెపాసిటీ గల బ్లెంజర్, టూల్ కిట్, 1 హెచ్‌పీ మోటార్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ యంత్రాన్ని అందించనున్నారు. టైప్- 2లో రూ. లక్ష విలువ గల కుండలు, గ్లాస్‌ల తయారీకి సంబందించిన డైమేకింగ్ మిషన్‌లు, 100 ఎంఎల్ టీ కప్ డైలు, బుండి మిషన్‌ను అందించనున్నారు.
మట్టి పాత్రలకు పెరిగిన డిమాండ్
ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో మట్టి పాత్రలకు డిమాండ్ పెరిగింది. శుభకార్యాలకు పెళ్లిపాత్రలు, గౌరీ దేవి నోము పాత్రలు, చల్లని నీటి కోసం రంజన్‌లు, తాబేలు బుర్ర, కూజలు, నీళ్ల కుండలు, దీపాలంకరణ కోసం చిప్పలను వినియోగిస్తున్నారు. కొంత మంది మట్టి పాత్రల్లో వంటలు కూడా చేసుకుంటున్నారు. అలంకరణ వస్తువుల కోసం కూడా మట్టి పాత్రలను విరివిగా ఉపయోగిస్తున్నారు. కుమ్మరి కుల వృత్తికి మరింత ఆదరణ తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలు అందించడానికి చర్యలు తీసుకుంటోంది. సబ్సిడీపై కుమ్మరులకు అధునాతన యంత్రాలు అందించనుంది.
కుమ్మరి వృత్తి కళాకారుల జీవన పరిణామాలు పెంచడానికి బీసీ సంక్షేమ శాఖ జిల్లాలో చర్యలు తీసుకుంటుంది.
*- యం. అనిల్ ప్రకాష్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి శాఖాధికారి,నాగర్ కర్నూలు*
కుమ్మరి వృత్తి వారికి స్వయం ఉపాధి రుణాలను మరింత మందికి అందించేందుకు
చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 9 మంది లబ్ధిదారులకు అందించి, యూనిట్లను గ్రౌండింగ్ చేస్తున్నాం.
నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, నియోజకవర్గం నుంచి వచ్చిన లబ్ధిదారులకు అందించాం.
ఒక్కో యూనిట్ కింద రూ. లక్ష రుణం అందించనున్నాం. ఇందులో రూ. 80 వేల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
మార్కెటింగ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తాం.
*- ఊరుకోండ రఘబాబు, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు, నాగర్ కర్నూలు*
కుల వృత్తులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
శిక్షణ పొందిన 9 మందితో జిల్లాలో ఇతర కుమ్మరులకు శిక్షణ అందిస్తాం.
జిల్లాలో అర్హులైన కుమ్మరి యువజనులందరికీ స్వయం ఉపాధి రుణాలను అందించాలి.
ఇందుకు అనుగుణంగా ధరఖాస్తులు స్వీకరించాలి. అవసరమైన పక్షంలో వృత్తి శిక్షణను సైతం అందరికీ అందించాలి.
వంద శాతం సబ్సిడీపై పరికరాలు, యంత్రాలు అందించాలి.
జిల్లాలో తయారుచేసిన వస్తువులను అమ్ముకునేందుకు జిల్లా కేంద్రంలో వసతిని కల్పించి మార్కెటింగ్ వ్యవస్థను కల్పించాలి.
కులవృత్తులను ప్రోత్సహించడానికి సర్కార్ అండగా ఉండడం సంతోషం.