కూటమి కుట్రలను తిప్పికొట్టండి
– చంద్రబాబు కుట్రలో కాంగ్రెస్ బందీ
– కూటమి గెలిస్తే పాలన ఏపీ, ఢిల్లీల నుంచి సాగుతుంది
– మన పాలన మనమే పాలించుకోవాలంటే తెరాసతోనే సాధ్యం
– నాలుగేళ్లలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి
– ఆపద్ధర్మ మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట, అక్టోబర్30(జనంసాక్షి): నాలుగేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతందని ఆపద్ధర్మ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడలేక కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ప్రాజెక్టులను, అభివృద్ధి పనులను అడ్డుకొనేందుకు కుట్రలు చేశాయని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూటమిపేరుతో వారు కలిసొస్తున్నారని వారి కుట్రలను ప్రజలంతా ఏకమై తిప్పికొట్టాలని అన్నారు. సూర్యపేట పట్టణం, సూర్యపేట రూరల్, చివ్వేంల మండలాల టీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్రలో కాంగ్రెస్ పార్టీ బందీ అయిందని అన్నారు. మహాకూటమి గెలిస్తే పాలన ఏపీ, ఢిల్లీల నుంచే సాగుతుందని, తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోతుందన్నారు. మన పాలన మనమే పాలించుకోవాలంటే తెరాసను మళ్లీ అధికారంలోకి తెచ్చి సీఎం కేసీఆర్ అయితేనే
సాధ్యమవుతుందని ఆమేరకు ప్రజలు తెరాసకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్నికలలో పార్టీ క్యాడర్, లీడర్ అనుసరించాల్సిన వ్యూహన్నీ శ్రేణులకు నిర్దేశించారు. ఒక్క సూర్యపేట పట్టణంలోనే 90 శాతానికి పై బడి ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకీ ఓటు వేసేందుకు సన్నద్ధమయ్యారన్నారు. కొత్తగా నమోదైన ఓటర్లపై దృష్టి సారించడంతో పాటు పోలింగ్ శాతాన్ని పెంపొందించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్ర రాజధానికి చేరుతున్న అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పానగల్లు ఉదయ సముద్రానికి చేరుతున్న నీటిని మూసికి చేర్చి ఆ నీటితో మూసి నదిని ప్రక్షాళన చేసి సూర్యపేటకు మొట్టమొదటి సారిగా కృష్ణా జలాలను అందించిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీదని, ముఖ్యమంత్రి కేసీఆర్ దని కొనియాడారు. ఇమాంపెట్ ఉండ్రుగొండ గుట్టలో నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ఎ/-లాంట్ తో సూర్యపేట పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించడం చారిత్రాత్మక ఘట్టామన్నారు. భారతదేశ చరిత్రలో ఎన్నికల మ్యానిఫెస్టోను పూర్తిగా అమలుపరిచి రికార్డ్ సృష్టించిన పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ అన్నారు. మ్యానిఫెస్టోలో లేని అంశాలు కళ్యాణలక్ష్మి, అమ్మవడి, కేసీఆర్ కిట్, వసతి గృహంలో సన్నబియ్యం అన్నం వంటి విప్లవాత్మక పధకాలు ప్రవేశ పెట్టి అమలు పరిచామన్నారు. మొట్టమొదటి సారిగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించిన పార్టీ టీఆర్‌ఎస్ అన్నారు. విద్య పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం చౌరస్తాలో నిలుచునే నిరుద్యోగ యువతకు ఇది ఆసరా అవుతుందన్న అంశాన్ని విరివిగా విద్యార్ధి యువత దృష్టికి చేరేలా పార్టీ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ద వహించాలని పేర్కొన్నారు.