కూటమి నేతలను నిలదీయండి: గాదరి

నల్లగొండ,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): నాలుగేండ్ల తమ పాలతనలో సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరించాలని టీఆర్‌ఎస్‌ తుంగతుర్తి నియోజకవర్గం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. ఎన్నికల్లోనే గ్రామాలకు వచ్చే మహాకూటమి నేతలను ప్రజలు నిలదీయాలన్నారు.  ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ హయాంలో నియోజకవర్గంలో రూ.1600 కోట్లతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. గతంలో కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాల పాలనలో నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరానికోసారి మంజూరు అయ్యే రూ.5లక్షల సీడీపీ నిధులను కూడా ఖర్చు చేయలేదన్నారు. తనూ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కోటాతోపాటు, మంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్‌ నిధులు వినియోగించి అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల మహాకూటమిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్‌  గెలుపే లక్ష్యంగా అన్ని గ్రామాల కార్యకర్తలు, నాయకులు పని చేయాలన్నారు. మహాకూటమి అభ్యర్థులకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు.