కూరగాయలు కొన్నమహారాష్ట్ర ముఖ్యమంత్రి

15brk-fadnavis3ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కూరగాయలు కొన్నారు. స్వయంగా తానే మార్కెట్‌కు వెళ్లి.. రూ. 200 విలువ చేసే కాయగూరలను తీసుకున్నారు. సీఎం మార్కెట్‌కి వెళ్లడమేంటా అనుకుంటున్నారా.. మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వం తరఫున కూరగాయల మార్కెట్‌ ఏర్పాటుచేశారు. ఈ మార్కెట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఫడణవీస్‌.. స్వయంగా కూరగాయలు కొని రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు.దళారీ వ్యవస్థకు అడ్డుకట్టవేసి.. రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా.. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సంత (వీక్లీ-మార్కెట్‌) ఏర్పాటుచేసింది. ప్రభుత్వమే స్వయంగా మార్కెట్లు ప్రారంభించి.. రైతులు నేరుగా తమ పంటను అమ్ముకునేందుకు వీలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ముంబయిలో విధాన్‌భవన్‌(అసెంబ్లీ) ప్రాంగణంలో మార్కెట్‌ను ఏర్పాటుచేశారు.

దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌ ప్రారంభించి.. అనంతరం రైతు బజార్‌లో రూ. 200 విలువ చేసే కూరగాయలు కొన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఈ వీక్లీ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. పుణెలో 27, నాగ్‌పూర్‌లో 3, థానేలో ఒక మార్కెట్‌ ఉండగా.. రాష్ట్ర వ్యాప్తంగా వీటిని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం.