కృత్రిమంగా పెట్రో ధరల పెంపు

ధరలపై నియంత్రణ కల్పోయిన కేంద్రం

జిఎస్టీతో వ్యాపారుల ఇబ్బందులు

ఘాటుగా విమర్శించిన చిదంబరం

న్యూఢిల్లీ,జూన్‌11(జ‌నం సాక్షి): భారత ఆర్థిక వ్యవస్థకు మూడు టైర్లు పంక్చర్‌ అయ్యాయని, యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మరోమారు విమర్శించారు. సోమవారం దిల్లీలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయనమాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల వ్యాపారులు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగితే ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ ధరల తగ్గింపును రాష్ట్రాల విూదకు నెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. ‘పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే తప్పకుండా ధరలు తగ్గుతాయి. కేంద్రంతో పాటు చాలా రాష్టాల్లో భాజపానే అధికారంలో ఉంది. మరి అలాంటపుడు పెట్రోల్‌ ధరల పెరుగుదలపై రాష్ట్రాలను ఎందుకు నిందిస్తున్నారు? వాళ్లకు అధిక రాష్ట్రాల్లో మెజారిటీ ఉంది కాబట్టి ధరలు తగ్గించాలి’ అని చిదంబరం డిమాండ్‌ చేశారు. రైతులు తమ పంటకు సరైన గిట్టుబాటు ధర అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు.’నాలుగు టైర్ల విూద ప్రయాణిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ మూడు టైర్లు పంక్చరై చతికిలపడింది. గత నాలుగేళ్లుగా అభివృద్ధి రేటు నెగటివ్‌గానే ఉంది. ప్రైవేటు పెట్టబడులు తగ్గిపోయాయి’ అని ఆయన విమర్శించారు. ‘గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినా.. ఉద్యోగాలు దొరకడం లేదని యువతకు అర్థమైంది. అందుకే వాళ్లు పకోడి అమ్ముకునే పనిని కూడా ఉద్యోగమనే అనుకుంటున్నారు’ అని చిదంబరం ఘాటు వ్యాఖ్యలు చేశారు.గత వారం పెట్రోల్‌ ధరలు పెరుగుతున్న సమయంలో చిదంబరం ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ ధరలను కృత్రిమంగా పెంచడంపై దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని చిదంబరం అన్నారు. 2014 మే-జూన్‌ నాటితో పోల్చుకుంటే.. ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎంతో పెరిగిపోయాయని, ఇంతగా ధరలు పెరగడానికి ఎలాంటి సరైన కారణమూ కనిపించడం లేదని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. పెట్రోల్‌ ధరలు పెరిగిపోయి సామాన్యుల పరిస్థితి దీనంగా మారిపోయిందని చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ హయాంలో పెట్టుబడులు రావడం లేదని, అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయని, మార్కెట్‌పై ప్రభుత్వానికి నియంత్రణ లేదని విమర్శించారు. 50వేల చిన్న కంపెనీలను మూసేశారని, ఇదేనా అభివృద్ధిని కేంద్రాన్ని చిదంబరం ప్రశ్నించారు. నోట్లరద్దు వల్ల దేశంలో వ్యాపారులు దెబ్బతిన్నారని అన్నారు. కరెన్సీ నోట్లు కలిగి ఉండటం ప్రజల హక్కు అని, దానిని ప్రభుత్వం దూరం చేయకూడదని పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేకుండా చేశారని చిదంబరం మండిపడ్డారు.