కృష్ణానదిలో పడవ ప్రమాదం
– తల్లీకూతుళ్ల మృతి
కృష్ణా, మే26(జనంసాక్షి) : కృష్ణా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారుల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారు జామున జరిగిన పడవ బోల్తా ప్రమాదంలో తల్లీకూతుళ్లు జల సమాధి అయ్యారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన మత్స్యకార కుటుంబం చేపలు పట్టేందుకు పడవపై నదిలోకి వెళ్లింది. నదిలో చేపల వల ఏర్పాటు చేసిన మత్స్యకారుడు నడకుదురు సైదారాజు తన భార్య మాధవి(26), కుమార్తె కావ్య(6)తో కలిసి పడవలో నిద్రిస్తున్నాడు. అదే సమయంలో ఇసుక తవ్వకానికి వచ్చిన డ్రెజ్జర్ బోటు వీరి పడవను బలంగా ఢీకొంది. దీంతో పడవ బోల్తా పడి వీరంతా నీటిలో మునిగిపోయారు. సైదారాజుకు ఈత రావటంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న తల్లీ కూతుళ్లు నదిలోనే ప్రాణాలు విడిచారు. మృత దేహాల ఆచూకీ కోసం జాతీయ విపత్తు దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) గాలింపు చేపట్టింది. ఇసుక తోడేయడం వల్ల మృతదేహాల వెలికితీత కష్టతరంగా మారింది. చివరికి మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.