కృష్ణా తీర ప్రాంతాలను సందర్శించిన మంత్రులు
మహబూబ్‌నగర్,ఫిబ్రవరి28(జనంసాక్షి): కొల్లాపూర్‌లోని కృష్ణాతీర ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్తు శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జడ్పీచైర్మన్ బండారీ భాస్కర్ శనివారం సందర్శించారు. మొదటగా జటప్రోలు ఆలయాలను, సోమేశ్వరక్షేత్రాన్ని, కృష్ణానదిలో బోటింగ్, కొల్లాపూర్‌లోని మాధవస్వామి దేవాలయం, సురభిరాజుల కోటభవనం, సింగోటంలోని శ్రీవారి సముద్రం చెరువు, లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలను పరిశీలించారు. సముదాయంలోని మదనగోపాలస్వామి ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకొని ఆలయ ఆవరణను పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మించిన విశ్రాంతి భవనాన్ని సందర్శించారు. ఇదిలావుంటే గ్రామంలో అంటరానితనం పాటిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దారు పాండు అన్నారు. శనివారం పానగల్ మండలంలోని చింతకుంట గ్రామంలో ఎస్వీకాలనీలో అంటరానితనంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దళితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్మశానవాటికను పరిశీలించి ఆంజనేయ దేవాలయంలో దళితులతో ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో సర్పంచి కృష్ణ, ఎంపీటీసీ కిరణ్‌కుమార్ గౌడ్, ఆర్‌ఐ కొండన్న, వీఆర్వో బాలీశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
.