గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు
సెప్టెంబర్ 06(జనంసాక్షి):హైదరాబాద్: ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. లక్షలాది భక్తుల మధ్య మహా గణపతి ట్యాంక్‌బండ్‌లో నిజమజ్జనమయ్యాడు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన బడా గణేశ్ శోభాయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. దారిపొడవున ఎక్కడ చూసినా గణపతి బప్ప మోరియా అంటూ చిన్నాపెద్దా అంతా వారి భక్తిని చాటుకున్నారు. అడుగడుగున మహాగణపతికి నీరాజనం పలికారు. మహాగణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
విజయవాడ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన వాహనంలో 70 టన్నుల భారీ గణనాథుడి శోభాయాత్ర నిర్వహించారు. భక్తుల కోలాహలం నడుమ ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో క్రేన్ వద్దకు చేరిన లంబోధరుడికి.. ఖైరతాబాద్ ఉత్సవసమితి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ క్రేన్ సహాయంతో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు.