మోదీ గొప్ప ప్రధాని..
` కానీ ప్రస్తుత సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు
` రష్యా చమురు కొనుగోలు నన్ను చాలా నిరాశకు గురిచేసింది
` నేను విధించిన 50 శాతం సుంకాలు చాలా ఎక్కువే..
` భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నా..
` భారత్- అమెరికా సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్(జనంసాక్షి):భారీ సుంకాల విధింపు నేపథ్యంలో భారత్- అమెరికా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ గొప్ప ప్రధాని అని ప్రశంసించారు. భారత్, రష్యాలకు దూరమయ్యాం అంటూ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నించగా.. ఆయన స్పందించారు. రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. అది తనను చాలా నిరాశకు గురిచేసిందన్నారు. అక్కడి చమురు కొనుగోలు చేయొద్దని భారత్‌కు చెప్పానన్నారు. వెనక్కి తగ్గకపోవడంతో భారత దిగుమతులపై పెద్ద మొత్తంలో టారిఫ్‌లు కూడా విధించానన్నారు. తాను విధించిన 50 శాతం సుంకాలు చాలా ఎక్కువని అంగీకరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకున్న వ్యక్తిగత సంబంధాల గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నారా? అని విలేకరి అడగ్గా.. కచ్చితంగా అని ట్రంప్ బదులిచ్చారు. ‘నేను ఎప్పుడూ అదే కోరుకుంటా. ప్రధాని మోదీతో నేను ఎప్పుడూ స్నేహంగానే ఉంటాను. ఆయన గొప్ప ప్రధాని. కానీ.. ప్రస్తుత సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. భారత్- అమెరికా మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని సమాధానమిచ్చారు. ఇటీవల మోదీ అమెరికాలో పర్యటించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.అంతకుముందు భారత్, రష్యాలను అమెరికా కోల్పోయిందని.. అవి రెండూ చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో వ్యాఖ్యానించారు. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు కలిసి ఉన్న ఫొటోను కూడా పంచుకున్నారు. ఆ మూడు దేశాలు సుదీర్ఘ, సుసంపన్న భవితవ్యం కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రష్యా, ఉత్తర కొరియాలతో కలిసి చైనా తమపై కుట్రపన్నుతున్నట్లు ఉందని ఆయన ఆరోపించారు.2026 జీ20 శిఖరాగ్ర సదస్సును మియామిలోని తన సొంత గోల్ఫ్ రిసార్ట్‌లో నిర్వహించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వచ్చే ఏడాది డిసెంబరులో ఈ సమ్మిట్ జరగనుంది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌ను ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’ గా మార్చే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.