కృష్ణా నదీ జలాల యజమాన్య బోర్డు తెలంగాణపై వివక్ష

4444కృష్ణా నదీ జలాల యజమాన్య బోర్డు తెలంగాణపై వివక్ష చూపుతోంది.బచావత్ ట్రిబ్యునల్ దామాషా ప్రకారం కృష్ణాజలాలను పంపిణీ చేయాలనే మూల సూత్రాన్ని విస్మరిస్తోంది. ఏపీకి వత్తాసు పలుకుతూ తెలంగాణకు అన్యాయం చేస్తోంది. అటు కేంద్రం కూడా తన బాధ్యతను మర్చిపోయి.. తెలంగాణ హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోంది. కృష్ణానదీ జలాల యజమాన్య బోర్డు ఏకపక్ష ధోరణిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నయి. ముఖ్యంగా గత రెండు సమావేశాల్లోనూ బోర్డు అధికారులు చూపిస్తున్న లెక్కల్లో తెలంగాణ తక్కువ నీటిని వినియోగించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ బచావత్ దామాషాను పక్కనపెడుతున్న బోర్డు అధికారులు కేవలం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి జరిగిన నీటి పంపిణీనే లెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ తక్కువ వాడుకున్నదంటూ వత్తాసు పలుకుతున్నారు. ఒకవైపు పట్టిసీమనుంచి గోదావరి జలాల మళ్లింపు, మరోవైపు ఏపీలో విస్తృతమైన వర్షాలను బోర్డు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే ఏడాది జూన్‌వరకు ఉభయ రాష్ట్రాలు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణాజలాల్ని పంపిణీ చేసుకోవాలనే ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల దరిమిలా సాగునీటికి కాకుండా కేవలం తాగునీటి కోసం ఆచితూచి వాడుకోవాలనే నిర్ణయించుకున్నారు. బచావత్ కేటాయింపులు ఎన్‌ బ్లాక్ ప్రాతిపదికన జరిగాయనేది జగమెరిగిన సత్యం. కృష్ణా బోర్డు కూడా ఎన్ బ్లాక్‌లో నీటి వినియోగం ఆధారంగానే రెండు రాష్ట్రాల మధ్య పంపిణీని లెక్కించాలి. కానీ బోర్డు తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
కృష్ణా జలాల పంపిణీలో ఆది నుంచి బోర్డు వ్యవహారం వివక్షాపూరితంగానే కనిపిస్తున్నది. గత నెలలో జరిగిన సమావేశంలో అప్పటివరకు తెలంగాణ వాస్తవంగా బచావత్ కేటాయింపుల మేరకు రావాల్సిన నీటికంటే ఏడు టీఎంసీలు తక్కువగా వాడుకుంది. ఇదేదీ పట్టించుకోని బోర్డు నవంబర్, డిసెంబర్ కేటాయింపులను ఏకపక్షంగా ఖరారు చేసింది. తెలంగాణకు కేవలం 3.70టీఎంసీల నీటిని కేటాయించి, ఏపీకి ఏకంగా 14టీఎంసీలు ఇచ్చింది. 2015-16లో డిసెంబర్‌ ఐదోతేదీవరకు కృష్ణాబేసిన్‌లో తెలంగాణ 44.497 టీఎంసీలు, ఏపీ 95.105టీఎంసీలు వాడుకున్నట్లు బోర్డు లెక్కల్లోనే ఉంది. బచావత్ దామాషా ప్రకారం తెలంగాణ 51.471 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంది. ఏపీ 88.131టీఎంసీలు వాడుకోవాలి.
వాస్తవంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రాజెక్టులవారిగా కేటాయింపులు జరిపింది. కానీ అది గెజిట్ కానందున అమలులోకి రాలేదు. ప్రస్తుతం ఉన్నది కృష్ణాబోర్డు అమలు చేయాల్సింది. బచావత్ కేటాయింపులు దామాషా మాత్రమే. అంతేకాదు ఈ ఏడాది జూన్ 18,19వ తేదీల్లో కేంద్ర జలవనరుల శాఖ సమక్షంలో రెండు రాష్ట్రాలు ఏడాదికిగాను కుదుర్చుకున్న ఒప్పందంలోనూ ఎన్ బ్లాక్ అని స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ కృష్ణాబోర్డు ఈ అంశాన్ని విస్మరించడం తెలంగాణపై వివక్షకు నిదర్శనమని నిపుణులు ఆరోపిస్తున్నారు. పైగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వాడుకున్న 7.06టీఎంసీలను తెలంగాణ ఖాతాలోనే వేశారు. చెన్నై నగరానికి పంపే నీటిని తెలంగాణ,రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు కేటాయించిన చరిత్ర ఉండగా ఉమ్మడి ఏపీ రాజధాని తాగునీటి అవసరాలను కేవలం తెలంగాణ ఖాతాలోనే వేయడం ఏ మేరకు సమంజసమన్నది ప్రశ్న. మరోవైపు ఒక బేసిన్ నుంచి మరో బేసిన్లోకి నీటిని మళ్లించినపుడు ఈ మేరకు ఎగువ ప్రాంతాలకు హక్కు ఉంటుందని బచావత్ అవార్డులోనే స్పష్టంగా ఉంది. చంద్రబాబు చెప్పినట్లు రోజుకు ఐదు టీఎంసీల గోదావరి జలాల్ని కృష్ణా బేసిన్‌లోకి మళ్లించినందుకు ఆ మేరకు తెలంగాణ అదనపు కృష్ణాజలాల్ని హక్కుగా వాడుకోవాలి. ట్రిబ్యునల్‌ను అమలుచేస్తున్న బోర్డుకు కూడా ఈ బాధ్యత ఉంది. కానీ ఇవేవి పట్టించుకోని కృష్ణా బోర్డు అధికారుల తీరుపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు కేంద్రం కూడా తన బాధ్యతను విస్మరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ సర్కారు తెలంగాణపై వివక్ష చూపుతుందని నీటిపారుదల రంగ నిపుణులు మండిపడుతున్నారు.