‘కృష్ణా’ నీటి పంచాయితీపై .. కేంద్రం కసరత్తు

` తెలంగాణ, ఏపీ జలాల వివాదం పరిష్కారానికి నిర్ణయం
` బాధ్యతలను రెండవ కృష్ణా ట్రైబ్యునల్‌కు అప్పగింత
` విభజన సెక్షన్‌లోని సెక్షన్‌ 89కు లోబడే ఈ బాధ్యతలు
` ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్‌ అత్యవసర భేటీ
` పసుపు బోర్డు, రూ.889 కోట్లతో ట్రైబల్‌ వర్సిటీకి ఆమోదం
` ఉజ్వల గ్యాస్‌ సిలిండర్‌ మీద 300 రాయితీ ప్రకటన
న్యూఢల్లీి(జనంసాక్షి):
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆకర్షించే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్‌ బిల్లు విషయంలో దేశవ్యాప్త పోరాటాలకు తలొగ్గిన కేంద్రం దానికి చట్టరూపం తీసుకొచ్చింది. పసుపు బోర్డు, ట్రైబల్‌ యూనివర్సిటీకి ఆమోదం తెలిపి తెలంగాణలోనూ పార్టీ మనుగడ సాగించేందుకు ఎత్తులు వేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢల్లీిలోని ఆయన నివాసంలో జరిగిన కేబినెట్‌ అత్యవసర భేటీలో తెలంగాణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదానికి కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు కృష్ణా ట్రైబ్యునల్‌కు-2కు అదనపు బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించి, ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేశారు. విభజన సెక్షన్‌లోని సెక్షన్‌ 89కు లోబడే ఈ బాధ్యతలు అప్పగించినట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడిరచారు.
తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తెలంగాణలో గిరిజనుల ఉన్నత విద్య కోసం ఈ వర్సిటీని రూ.889.07కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను కేంద్రమంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, కిషన్‌ రెడ్డి సహా పలువురు విూడియాకు వెల్లడిరచారు. ఉజ్వల పథకం లబ్దిదారులకు గ్యాస్‌ సిలిండర్‌పై ఇచ్చే రాయితీని రూ.300లకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.  రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి విధివిధానాలు రూపొందించాలని రెండో కృష్ణా ట్రైబ్యునల్‌కు మంత్రివర్గం విజ్ఞప్తి చేసిందన్నారు. ఈ నిర్ణయం వల్ల 50లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కొత్త నిబంధనలు రూపొందించి తమ వాటాను తేల్చాలని తెలంగాణ కోరుతోందన్నారు. ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జలాల పంపిణీ చేయాలన్నారు. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందని కిషన్‌ రెడ్డి తెలిపారు.ఉజ్వల పథకం కింద పేదలకు సరఫరా చేసే వంట గ్యాస్‌ సిలిండర్‌పై ప్రస్తుతం కేంద్రం రూ.200ల చొప్పున రాయితీ ఇస్తుండగా.. తాజాగా దాన్ని 300లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌ మార్కెట్‌ ధర రూ.903 ఉండగా.. ఉజ్వల లబ్దిదారులు రూ.703 చొప్పున చెల్లిస్తున్నారు. తాజాగా కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఆ లబ్దిదారులంతా సిలిండర్‌కు రూ.603 చొప్పున చెల్లిస్తే చాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌  బుధవారం సమావేశం అయింది. ఢల్లీిలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. తెలుగురాష్టాల్ర మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తూ కేంద్రం తీర్మానం చేయడం గమనార్హం.