కృష్ణా పుష్కరాల్లో విషాదం

 గత నాలుగు రోజులుగా ప్రశాంతంగా కొనసాగుతున్న కృష్ణా పుష్కరాల్లో ఐదోరోజైన మంగళవారం విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు సంఘటనల్లో 9మంది మృత్యువాత పడ్డారు.

పవిత్ర సంగమం ఘాట్‌ సమీపంలో పిండ ప్రదానం కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చి మైలవరానికి చెందిన సూరేపల్లి రంగారావు(60) గుండెపోటుతో మృతిచెందారు.

ఇబ్రహీంపట్నంలోని పుష్కర్‌నగర్‌లో భోజనం చేస్తూ వీటీపీఎస్‌ విశ్రాంత ఉద్యోగి రాయపూడి మోహనరావు గుండెపోటుతో మృతిచెందారు.

కృష్ణానదిలో ఐదుగురు విద్యార్థులు మృతి
అమరావతి మండలం గిడుగు సమీపంలో కృష్ణా నదిలో ఈత కొట్టేందుకు దిగి ఐదుమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా నందిగామ నుంచి 11 మంది విద్యార్థులు కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. నది మధ్యలో లంక ప్రదేశంలో పడవ ఆపి నీటిలో దిగారు. వీరు దిగిన ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటంతో కృష్ణా జిల్లా తోటరావులపాడు గ్రామానికి చెందిన ములకలపల్లి హరీష్‌(20), నందిగామ గ్రామానికి చెందిన కూచు లోకేశ్‌(21), కొమ్మవరపు హరిగోపాల్‌(20), చెరుకొమ్మపాలెం గ్రామానికి చెందిన పాశం గోపిరెడ్డి(21), జయంతి గ్రామానికి చెందిన నగేశ్‌(21) మునిగిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయచర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు.

పుష్కర విధులకు వెళ్తూ ఉద్యోగిని మృతి
కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించేందుకు వెళ్తూ ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ కల్పన ప్రమాదంలో మృతిచెందింది. మువ్వ ఘాట్‌ వద్ద విధులు నిర్వహించేందుకు కుమారుడి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆమె చున్నీ బండి వెనక చక్రంలో ఇరుక్కుపోయింది. దీంతో చున్నీ మెడకు బిగుసుకుని కల్పన అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

కానిస్టేబుల్‌కి అస్వస్థత
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం ఘాట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న జరీనా బేగం అనే మహిళా కానిస్టేబుల్‌ అస్వస్థతకు గురైంది. ఎండకు తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స అందించారు.