కెసిఆర్ చిరకాల సిఎంగా ఉండాలని కోరుకుంటున్నారు: ఎమ్మెల్యే
యాదాద్రి,జూలై2(జనం సాక్షి): మరో 20 సంవత్సరాల వరకూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్ల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి ముందుకు సాగుతున్నామని అన్నారు. సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతంపై వివక్ష చూపించారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశారన్నారు. ఇన్నిసంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఇంటింటికీ తిరుగుతూ తాము అది చేస్తాం.. ఇది చేస్తామని ప్రజల ముందుకు వస్తున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.