కెసిఆర్ దూరదృష్టితోనే నిరంతర విద్యుత్
అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి
రైతు సంక్షేమ పథకాలపై విమర్శలు తగవు: మంత్రి
నల్గొండ,జూన్23(జనం సాక్షి): సీఎం కేసీఆర్ సమర్థ పాలనతో రాష్ట్రం ఏర్పాటైన ఏడాదిలోపే 24 గంటల విద్యుత్ సరఫరా దేశంలోనే తొలిసారి ప్రారంభించుకున్నామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. ఆ తరవాత వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని అన్నారు. రాష్ట్ర అవసరాల మేరకు విద్యుత్ ఉత్పత్తికి కూడా సిఎం కెసిఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని శనివారం నాడిక్కడ అన్నారు. రాష్ట్రంలో అధికశాతం ఉన్న రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకే ప్రభుత్వం రైతు జీవిత బీమా పథకం తెచ్చిందని మంత్రి వివరించారు. అయితే మతి లేకుండా విపక్షాలకు చెందిన వారు ఈ పథకాన్ని సైతం విమర్శించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలోని 98.24 శాతం ఉన్న సన్నకారు రైతులు సొంతంగా బీమా కట్టుకునే స్థితిలో లేరనే ఉద్దేశంతో వాళ్లకు రూ. 2271 ప్రతి ఏటా ప్రీమియంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కేవలం 0.11 శాతం మంది మాత్రమే రాష్ట్రంలో 25 ఎకరాలకు పైగా భూములు కలిగి ఉన్నారని వివరించారు. భూమినే నమ్ముకున్న రైతుకు దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే ఆ రైతు కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సొమ్ము పది రోజుల్లోనే అందుతుందని చెప్పారు. ఉద్యమ అధినేతగానే కేసీఆర్ ప్రణాళికలు రచించారని చెప్పారు. ఫలితంగానే మిషన్ భగీరథను చౌటుప్పల్‌లో ప్రారంభించడతో పాటు శాశ్వత పరిష్కారం కోసం రూ. 4500 కోట్లతో డిండి ఎత్తిపోతల పథకం నుంచి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల దశ మార్చేలా ప్రాజెక్టుల పనులు చేపడుతున్నారని చెప్పారు. రుణమాఫీతో ఉమ్మడి జిల్లాకు రూ. 2350 కోట్లు.. రైతుబంధుతో పెట్టుబడి సాయంగా రూ. 1000 కోట్లు లబ్ది చేకూరిందని వివరించారు. అప్పుల్లేకుండా సాగు చేసే రోజులు రావాలని కలలుగన్న సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగానే ఎకరాకు రూ. 4 వేలు ఒక్కో సీజన్ పంట సాగుకు అందిస్తున్నారని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌తోనూ అత్యధిక ప్రయోజనం నల్లగొండ జిల్లాకే దక్కిందని తెలిపారు. ఏటా 1611 టీఎంసీలు సముద్రంలో కలిసే గోదావరి నీటిలో 936 టీఎంసీల వాటా.. 500 టీఎంసీలు సముద్రంలో కలిసే కృష్ణా నదిలో 350 టీఎంసీల వాటా తెలంగాణకు ఉందన్నారు. కోటీ యాభై లక్షలు ఖర్చు చేస్తూ బృహత్ యజ్ఞంలా చేపడుతున్న కార్యక్రమం మన భవిష్యత్ తరాలకు మంచి ఫలితాన్ని అందిస్తుందని అన్నారు. మిషన్ కాకతీయలో 4 వేలకు పైగా చెరువులతోపాటు రూ. 300 కోట్లతో మూసీ కాల్వల ఆధునీకరణ, మూసీ ప్రాజెక్టుకు రూ. 80 కోట్లతో వానాకాలం సైతం నీళ్లిచ్చేలా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. ప్రధాన వాగుల పైన రూ. 200 కోట్లతో చెక్‌డ్యాంలు, డిండి ప్రాజెక్టుతో దేవరకొండ, మునుగోడు.. కాళేశ్వరంతో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ.. గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లతో ఆలేరు, భువనగిరి.. ఇలా ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా కృషి చేస్తున్నదని జగదీష్‌రెడ్డి వివరించారు. వ్యవసాయం రైతు ఖర్మ అని గత పాలకులు భావిస్తే.. రైతు మన బాధ్యత అని తమ ప్రభుత్వం నేడు నిర్వర్తిస్తోందని తెలిపారు.