కెసిఆర్‌ నాటకాలకు 11న తెర

ప్రచారంలో పొన్నాల లక్ష్మయ్య
జనగామ,డిసెంబర3(జ‌నంసాక్షి ): కేసీఆర్‌ నాటకాల రాయుడని, ఒక వైపు ఎంఐఎంను బాహాటంగా సమర్థిస్తూ, మరో వైపు భాజపాతో అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నారని సిఎం కెసిఆర్‌పై మాజీమంత్రి జనగామ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కల్లబొల్లి కబుర్లతో నాలుగున్నరేళ్లు పాలన చేసి తెలంగాణ ప్రజలకు టోపీ పెట్టారని అన్నారు. టిఆర్‌ఎస్‌, బిజెపి, ఎంఐఎం ఒకే గూటి పార్టీలని ఆరోపించారు.  ఓట్లు చీల్చడానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన సీపీఎం కూటమితో కేసీఆర్‌ రహస్య ఒప్పందం చేసుకున్నారని, వచ్చేది ప్రజాకూటమి ప్రభుత్వమేనని ఆయన అన్నారు. డిసెంబరు 11న తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ నుంచి, ఆయన అబద్దాల నుంచి విముక్తి కలుగుతుందన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణలో తెదేపాతో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్‌ తప్పుపడుతున్నారని, తెదేపా తెలంగాణకు మద్దతిచ్చిందని మరచి పోతున్నారని అన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి ఆరోపణలను తెరపైకి తెచ్చారని అన్నారు.  ప్రజాకూటమి అధికారంలోకి వస్తే కాళేశ్వరంలాంటి ప్రాజెక్టులు కొనసాగుతాయని,  అందులో అవినీతిపై విచారణ జరుగుతుందని చెప్పారు. ప్రజాకూటమి  అధికారంలోకి రాగానే కేసీఆర్‌ తన ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకోవాలని ఎద్దేవా చేశారు. అధికారం అడ్డుపెట్టుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నేతలకు స్వస్తి పలికి  కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

తాజావార్తలు