కెసిఆర్‌ మెజార్టీ లక్ష ఓట్లకు తగ్గరాదు

ప్రజలకు మంత్రి హరీష్‌ రావు పిలుపు
గుంటిపల్లి గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానంపై అభినందన
ప్రతి గ్రామానికి ఇది ఆదర్శం కావాలని వినతి
సిద్దిపేట,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి, గౌరవాన్ని చాటాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని వర్గల్‌ మండలం గుంటిపల్లి గ్రామస్తులు.. టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామని మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. వానా కాలంలో ఊసిళ్లు వచ్చినట్లు ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్‌ నాయకులు గ్రామాల్లోకి వస్తారని ఎద్దెవా చేశారు. ఇతర పార్టీలకు డిపాజిట్లు గల్లంతు చేయాలన్నారు
గుంటిపల్లి గ్రామస్థులు తీసుకున్న నిర్ణయం నియోజక వర్గంలో అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రజలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, తెరాస పార్టీకి ఉన్న ఆదరణను ఎలాంటిదో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే అది వృథా అవ్వడమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదన్నారు. నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి కనీసం డిపాజిట్‌ దక్కే పరిస్థితి కూడా లేదన్నారు. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌ వారు ఓట్ల కోసమంటూ బయల్దేరతారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త తనవంతు కృషి చేయాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి పన్యాల భూపతిరెడ్డి అన్నారు. భారీ మెజార్టీని సాధించిపెట్టి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్‌ రాకుండా చూసే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. ఇందుకోసం గ్రామ స్థాయిలోని టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు చొరవ చూపించాలన్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం గడిచిన నాలుగేండ్లలో చేపట్టిన పలు సంక్షేమ అభివృద్ధి పథకాలపై గడపగడపకు వెళ్లి ఓటర్లకు వివరించాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు శ్రమించాలన్నారు.

తాజావార్తలు