కెసిఆర్‌ రాజకీయ జైత్రయాత్ర విజయం అవుతుంది: ఎమ్మెల్యే

సిద్దిపేట,మే3(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాటు చేయనున్న ఫెడరల్‌ ఫ్రంట్‌తో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రానున్నదని ఎమ్మెల్యే రామలింగారెడ్డి చెప్పారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్న కేసీఆర్‌ను చూసి కాంగ్రెస్‌, బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని పేర్కొన్నారు. 
నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌ నాయకులు లేనిపోని విమర్శలకు దిగుతున్నారని  ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ విజయవంతంతో దిక్కుతోచక కాంగ్రెస్‌ నేతలు  ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. 2019 ఎన్నికల్లో మళ్లీ టిఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ హాయాంలో ఒరిగిందేంలేదన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కాళేశ్వరం పూర్తయితే పుట్టగతులుండవనే కాంగ్రెస్‌ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని సూచించారు.