కెసిఆర్ లేని దేశ రాజకీయాలను ఊహించలేం !
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యమ్నాయ కూటమి వైపు వివిధ ప్రాంతీయ పార్టీలన్నీ కలసి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కాంగ్రెస్ కేంద్రంగా వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వీరి రాజకీయాలన్నీ రాహుల్, శరద్ పవార్,మమతా బెనర్జీ చుట్టే తిరుగు తున్నాయి. ప్రధానంగా వీరంతా ఉత్తరాదికి చెందిన వారే కావడం గమనార్హం. ఈ ముగ్గురిలో శరద్ పవార్ వయసు విూదపడిరది. మమతా బెనర్జీ కేవలం బెంగాల్‌కు మాత్రమే పరిమితమైన నాయకురాలు. రాహుల్‌ను విఫల రాజకీయనేతగా చూడాలి. నిజానికి బీజేపీని గద్దెదించడానికి వీరెవరికి శక్తి చాలదు. మోడీ లాంటి నాయకుడిని ఢీకొనే సత్తా వీరెవరికీ లేదు. తెలంగాణ సిఎం కెసిఆర్ గత సార్వత్రిక ఎన్నికల్లోనే తనవంతుగా ప్రత్యామ్నాయ కూటమికి యత్నాలు ప్రారంభించారు. కానీ ఎవరు కూడా ఆయన ప్రయత్నాలకు పెద్దగా కలసిరాలేదు. దీంతో కెసిఆర్ కూడా మరో అడుగు వేయకుండా అలాగే ఉండిపోయారు. అయితే ఇక్కడో విషయాన్ని గమనించాలి. కెసిఆర్ లేకుండా జాతీయ ప్రత్యామ్నాయ కూటమి అన్నది విఫల ప్రయత్నమే కాగలదు. దేశంలో ఇప్పుడున్న ఛరిష్మా కలిగిన నేతల్లో కెసిఆర్ మాత్రమే సమర్థుడు. ఒక్క ఛరిష్మానే కాదు….మంచి వ్యూహకర్త కూడా. భారత రాజకీయాలతో పాటు ప్రపంచ రాజకీయాలను బాగా ఎరిగిన వ్యక్తి. ఈ దేశ భౌగోళిక పరిస్థితులు, సామాజిక స్థితిగతులు బాగా అధ్యయనం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు కెసిఆర్ మాత్రమే. తెలంగాణ ఉద్యమ సందర్భంగా అనేక అంశాలను, దేశ రాజకీయాలను, రాజ్యాంగాన్ని బాగా అధ్యయనం చేసిన వ్యక్తిగా ఈ దేశ సమస్యలను బాగా అవుపోసన పట్టారు. అంతేగాకుండా ఈ దేశ సమస్యలతో పాటు, వాటిని అధిగమించడానికి దేశంలో ఉన్న వనరులపైనా బాగా అవగాహన ఉన్న రాజకీయవేత్త కావడం గమనార్హం. అందుకే తెలంగాణలో అమలవుతున్న వివిధ రకాల పథకాలు కావచు.. నీటి పారుదల రంగమే కావచ్చు..ఓ పద్దతి ప్రకారం వ్యూహాత్మకంగా అమలు చేయడం ద్వారా తెలంగాణ దరిద్రాన్ని రూపు మాపాలన్న సంకల్పంతో చేపట్టినవిగానే భావించాలి. ఈ క్రమంలో ప్రస్తుత మోడీ నాయకత్వంలోని బిజెపిని ఢీకొనే సత్తా కలిగిన ఏకకై నాయకుడు సిఎం కెసిఆర్ అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే భాషాపరంగా కూడా కెసిఆర్ మంచి పట్టున్న నాయకుడు. పట్టుదల ఉన్న రాజకీయవేత్త. ఉత్తరభారతంతో పాటు, దక్షిణ భారతదేశంలో కూడా భావవ్యక్తీకరణను తెలిసిన రాజకీయవేత్తగా గుర్తించాలి. అయితే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీల కూటమి రూపుదిద్దు కుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. శరద్ పవార్ కూడా చురుకుగా పాల్గొనాలనుకున్నా ఆయనకు వయసు అడ్డంకిగా మారింది. అయితే భారత రాజకీయాల్లో కెసిఆర్ లేకుండా ముందుకు నడవాలని ఆయా పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కాక తప్పవు. మమతా బెనర్జీ పెద్దగా ఆకర్శణ లేని నాయకురాలు. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కెసిఆర్ లేకుండా భారత రాజకీయాలను ఊహించుకోలేం. ప్రాంతీయ శక్తుల సమాఖ్యగా ఏర్పడి.. మమతా బెనర్జీ తమ కూటమి నేతగా ప్రజల ముగింటకు వెళతారని పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. సమాఖ్య వ్యవస్థపై తమకున్న విశ్వాసం, దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అయితే ఈ ప్రయత్నం గతంలోనే కెసిఆర్ చేశారు. దేశ రాజకీయాల పై కెసిఆర్‌కు ఉన్నంత అవగాహన, అభిరుచి, పట్టు మరే నాయకుడికి లేదంటే అతిశయోక్తి కాదు. కెసిఆర్‌ను లేకుండా తీసుకుని వచ్చే ఎలాంటి కూటమైనా మోడీ ముందు పేలవం కానుంది. ఇకపోతే మమతా బెనర్జీ తనకుతాను అపరకాళికగా ఊహించుకోవచ్చు. కానీ ఆమె బెంగాల్ దాటి రాజకీయాలు చేయలేదు. అలా
చేసివుంటే పరిస్థితి మరోలా ఉండేది. ప్రధానంగా భాషా సమస్య కూడా అడ్డంకిగా కాబోతున్నది. అయితే తెలంగాణలో కేసీఆర్‌ను విమర్శించడమే వ్యూహం అనుకునేవాళ్లకు ఏ కారణం ఉండాల్సిన అవసరం లేదు. బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా అభివృద్ధికి విరుద్దంగా మాట్లాడవచ్చు. అయితే కెసిఆర్ తను అనుకున్న వ్యూహం మేరకు అభివృద్దిని పట్టాలకు ఎక్కించడంలో సిద్దహస్తుడు. అందుకే కోటి ఎకరాల మాగాణం సాకారం కాబోతున్నది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత సాగునీటి, తాగునీటి రంగంలో సాధించిన విప్లవాలను తక్కువ చేసి చూడరాదు. కాంగ్రెస్ పాలనలో ఇలాంటి అభివృద్ది జరిగిందా అన్నది ఆలోచించాలి. ప్రజా సమస్యలపై, పరిపాలన సంబంధ విషయాల్లో కనీస పరిజ్ఞానం లేని కొంతమంది సోషల్ విూడియా సాయంతో రాత్రికిరాత్రే నాయకులు కాలేరు. దేశ రాజకీయాల్లో రావాలనుకునే వారికి జాతీయ,అంతర్జాతీయ విషయాలపై అవగాహన అవసరం. ఇప్పుడు కేంద్రంలో రాజకీయాలు వెలగబెడుతున్న వారు కెసిఆర్ ముందు దిగదుడుపే. నిజానికి కెసిఆర్ ప్రాంతీయ పార్టీ నాయకుడిగా లేకుండా బిజెపిలో నేతగా ఉండివుంటే మోడీకన్నా ముందే ఈ దేశానికి నాయకుడు అయ్యే వారు. పివి నరసింహారావు, వాజ్‌పేయ్,అద్వానీ, మురళీమనోహర్ జోషి లాంటి స్థాయి వారిని మించిన నాయకుడ య్యేవారు. అన్నింటికి మించి రాజకీయాల్లో ప్రజలకు ఏదో చేయాలన్న తప్పన పట్టుదల ముఖ్యం. అలాగే దేశానికి మేలు చేయాలన్న స్వార్థం కూడా ఉండాలి. 140 కోట్లు ఉన్న జనాభాకు వనరుల ను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో అన్న అవగాహనా ముఖ్యం. ఇవన్నీ కూడా కెసిఆర్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఆయనకు దేశ పగ్గాలు అప్పగిస్తే తెలంగాణలో జరుగుతున్న అద్భుతాలు దేశంలోనూ కనిపి స్తాయి. ప్రజలకు నిరంతర విద్యుత, సాగు,తాగునీరు ఎలా అందించవచ్చో చేసి చూపుతారు. వ్యవసాయాన్ని బలోపేతం చేసి దేశీయంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచి, ప్రజలకు ఆహార కష్టాలు లేకుండా చేయగల సమర్థత ఉన్న నాయకుడు కేసిఆర్ అని ఘంటాపథంగా చెప్పవచ్చు. అందువల్ల మమతా బెనర్జీల కావచ్చు, శరద్ పవార్ కావచ్చు.. రాహుల కావచ్చు..ప్రత్యామ్నాయ రాజకీయాలు ఆలోచించే ముందు కెసిఆర్‌ను విశ్వాసంలోకి తీసుకుని ముందుకు వెళ్లాల్సిందే. లేకుంటే మోడీ ఎత్తు ముందు వారు చిత్తు కాక తప్పదు. సమకాలీన రాజకీయాల్లో మోడీని ఢీకొనగల సత్తా ఉన్న ఏకైక నాయకుడు కెసిఆర్ మాత్రమే అని ఈ నాయకులు గుర్తించి ముందుకు సాగాలి.