కెసిఆర్‌ సమర్థ నాయకత్వమే శ్రీరామరక్ష

ప్రజలంతా టిఆర్‌ఎస్‌ వెన్నంటి ఉన్నారు

సంక్షేమ పథకాలే విజయసోపానాలు

మరోమారు గెలిపిస్తే మరింతగా అభివృద్ది

ప్రచారంలో ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీత

యాదాద్రి,నవంబర్‌21(జ‌నంసాక్షి): కెసిఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించిందని ఆలేరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ నాలుగేళ్లలో అమలు చ ఏసుకున్నామని అన్నారు. వివిధ పార్టీల నుంచి వచ్చి పార్టీలో చేరిన వారికి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి భారీగా చేరికలు జరుగుతున్నాయన్నారు. ప్రజాదరణ లేని మహాకూటమికి ఓటమి తప్పదని ఆమె అన్నారు. యాదాద్రిలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదన్నారు. సబ్బండవర్ణాల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తామన్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా సంక్షేమ పథకాలు పొందిన లబ్దిదారులు చూపిస్తున్న ఆదరణ మరువలేనిదన్నారు. సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటామని చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. మరోసారి అండగా ఉండి.. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆలేరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి మహిళలు మంగళహారతులిచ్చి, బొట్టు పెట్టి స్వాగతం పలికారు. భారీ ర్యాలీ, కోలాటాలు, బతుకమ్మలు, డప్పు చప్పుళ్ల మధ్య ప్రచారం జరిగింది. దీంతో గ్రామాలు గులాబీమయంగా మారాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ పేదల సంక్షేమానికి అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందాయని, ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారన్నారు. గౌడన్నలకు తాటీ పన్ను రద్ధు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని

అన్నారు. అంతేకాకుండా యాదవులకు సబ్సిడీపై గొర్రెలు, రైతులకు సబ్సిడీపై పాడి గేదెలు, లీటరు పాలకు రూ.4 ప్రోత్సాహకం, చేపల పంపిణీ, కుల సంఘాల భవనాల నిర్మాణం ఇలా అన్ని వర్గాల అభ్యున్నతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో నేతన్నల పరిస్థితి చూసి చలించిన కేసీఆర్‌ జోలే పట్టి ఆర్థికసాయం చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా ఆసరా, సాగు నీరు అందించేందుకు మిషన్‌ కాకతీయ, తాగునీటి కోసం మిషన్‌ భగీరథ, ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహకారం కోసం కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా ఇలా ఎన్నో పథకాలను పారదర్శంగా అమలు చేసినట్లు తెలిపారు. ఈ పథకాలే ప్రజలను టీఆర్‌ఎస్‌కు ఓటేసేలా చేస్తాయన్నారు. టీఆర్‌ఎస్‌ రైతులు అడగకుండానే 24 గంటల ఉచిత కరెంట్‌ అందించిందన్నారు. నాడు కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో రైతుల కండ్లలో కన్నీరు చూస్తే నేడు టీఆర్‌ఎస్‌ సుపరిపాలనలో రైతుల కండ్లలో ఆనందం చూస్తున్నామన్నారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచిన కాంగ్రెసోళ్లకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని చూసిన ప్రజలు.. తాను ప్రచారం కోసం ఏ గ్రామానికెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కూటమి నేతలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు వాటిని తిప్పికొడుతారన్నారు.