కేంద్రం నుంచి రావాల్సిన నిధులను.. 

విడుదల చేయండి
– మూడు నెలల కాలానికి రూ.60కోట్లు రావాల్సి ఉంది
– కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి విన్నవించిన మంత్రి హరీష్‌రావు
– నీటిపారుదల ప్రాజెక్టులు, హైవేలపై చర్చించామని హరీష్‌రావు వెల్లడి
న్యూఢిల్లీ, జులై9(జ‌నం సాక్షి) : పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడులయ్యేలా చూడాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. సోమవారం ఢిల్లీలో నితిన్‌గడ్కరీతో హరీష్‌రావు సమావేశమయ్యారు. నీటి పారుదల ప్రాజెక్టులకు సహకారం, జాతీయ రహదారులకు నిధుల కేటాయింపులపై చర్చించారు. నితిన్‌ గడ్కరీతో సమావేశం ముగిసిన అనంతరం హరీశ్‌రావు విూడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులకు సహకారం, జాతీయ రహదారులకు నిధుల అంశంపై కేంద్రమంత్రితో చర్చించామని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చినందుకు గడ్కరీకి కృతజ్ఞతలు చెప్పామన్నారు. బీమా, నీల్వాయి, ర్యాలివాగు, మత్తడి వాగు, కొమ్రంభీం ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని, ఈ మూడు నెలల కాలానకి దాదాపు రూ. 50 నుంచి 60 కోట్లు రావాల్సి ఉందని గడ్కరీకి విన్నవించామన్నారు. ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలని సంబంధిత అధికారులను నితిన్‌ గడ్కరీ ఆదేశించారని హరీశ్‌రావు తెలిపారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు జాతీయ రహదారులను కేటాయించాలని కోరామన్నారు. సిద్దిపేట – ఎల్కతుర్తి, జనగామ – దుద్దెడ, మెదక్‌ – ఎల్లారెడ్డి, ఫకీరాబాద్‌ – భైంసా, సిరిసిల్ల – కామారెడ్డి, వలిగొండ – తొర్రూర్‌, నిర్మల్‌ – ఖానాపూర్‌ రహదారులను ఈ ఆర్థిక సంవత్సర ప్రణాళికలో చేర్చి.. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కేంద్రమంత్రి కోరినట్లు మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు. తమ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని హరీశ్‌రావు స్పష్టం చేశారు.