కేంద్రం మనల్ని దారుణంగా దగా చేసింది

విభజన హావిూలను నెరవేర్చకుండా మోసం

మోడీ తీరుపై మండిపడ్డ బాబు

బిజెపితో పొత్తు పెట్టుకునే వారిని ఓడించాలని పిలుపు

విజయనగరం,జూన్‌4(జ‌నం సాక్షి ): ఐదు కోట్ల ప్రజల కోసమే నవనిర్మాణ దీక్ష చేపట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎపి ప్రయోజనాల కోసం బిజెపితో పొత్తు పెట్టుకుంటే మనల్ని దారుణంగా మోసం చేశారని కేంద్రంపై మండిపడ్డారు. విభజన హావిూల అమలులో కేంద్రం పూర్తిగా విఫలమయ్యిందన్నారు. శృంగవరపుకోటలో చేపట్టిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు, పథకాల అమలు తీరుపై రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. రాష్ట్ర ప్రజానీకం కోసమే భాజపాతో పొత్తు పెట్టుకున్నామని.. తిరుపతి వెంకన్న సాక్షిగా ఆనాడు ప్రధాని మోదీ అన్ని అంశాలపై హావిూ ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. ఆ తర్వాత మోదీ మాట మార్చారని.. రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. అయితే కేంద్రం న్యాయం చేస్తుందని ఎంతో సహనంతో వేచి చూశామని.. హావిూల సాధనకు పోరాటమే మార్గమని ఎన్డీయే కూటమి నుంచి బయటకి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైకాపా రాజీనామా డ్రామాలు ఆడుతోంది. ఎన్నికలు రాని సమయం చూసి రాజీనామాల నాటకాలు ఆడుతున్నారు. వైకాపా నేతలకు ధైర్యం ఉంటే మోదీ, భాజపాపై పోరాడాలి. మోదీ ప్రభుత్వం ఏపీపై కుట్ర పన్నింది. ఈ కుట్రలో భాగంగానే వైకాపా నేతలు, పవన్‌ కల్యాణ్‌ నాపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని బలహీన పరిచే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపవిత్రం చేసే విధంగా కుట్ర పన్నుతున్నారు. అయితే ఈ కుట్రలు వేరే రాష్ట్రాల్లో చెల్లుబాటు అవుతాయేమో కానీ.. ఏపీలో సాగవు. వచ్చే ఎన్నికల్లో భాజపాతో పొత్తుపెట్టుకునే పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలి.’ అని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంతో రాజీ లేదు.. ధర్మపోరాటం చేస్తాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ కార్యక్రమాలను వదిలిపెట్టలేదు. కేంద్రం, ఆర్‌బీఐ ఒప్పుకోకపోయినా రుణమాఫీ అమలు చేశాం. మహిళా సంఘాల రుణాలు రద్దు చేశాం. సాగునీటి పథకాలకు ప్రాధాన్యత ఇచ్చాం. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించేందుకు శ్రీకారం చుట్టాం. పండించే పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత తీసుకున్నాం ‘ అని చంద్రబాబు అన్నారు.జమ్మాదేవిపేట గ్రామంలో కలియతిరిగిన బాబురాష్ట్రంలో ఏ ఒక్కరూ అభద్రతా భావంతో ఉండకూడదని, కష్టాల్లో ఉన్న ప్రతిఒక్కరికీ ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన లక్కవరపుకోట మండలంలోని జమ్మాదేవిపేట గ్రామాన్ని సందర్శించారు. ఊరంతా కలియ తిరిగారు .ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమై వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పింఛను వస్తోందా? నెలవారీ కరెక్టుగా ఇస్తున్నారా? ఎవరైనా పైసలు అడుగుతున్నారా? విూ కోసమే ప్రత్యేకంగా ఇస్తున్నాం. రాష్ట్రంలో 50లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం అంటూ వృద్ధులను ఆరా తీశారు. అనంతరం గ్రామదర్శిని కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రచ్చబండ వద్ద ప్రజలతో ముచ్చటించారు. గ్రామాభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తీరు ఎలా ఉందో గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా శానటరీ న్యాప్‌కిన్‌లు అందజేస్తామని తెలిపారు. నవ నిర్మాణ దీక్ష లక్ష్యాలను గ్రామస్థులకు చంద్రబాబు వివరించారు. అనంతరం ఎస్‌.కోటలో జరిగే నవనిర్మాణ దీక్ష బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు.రైతు సంక్షేమం, ఆహార భద్రత అంశంపై చంద్రబాబు చర్చించనున్నారు.