కేంద్రం మాట నిలబెట్టుకోవాలి
గడువులోగా తెలంగాణ ప్రకటించాలి: టీ కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్, జనవరి 22 (జనంసాక్షి) :
కేంద్రం తెలంగాణపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 28లోగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై నిర్దిష్టమైన ప్రకటన చేయాలని టీ కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని కోరారు. మంగళవారం తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసి ప్రజల ఆకాంక్షలను మరోసారి విన్నవించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ ి ప్రజలు చేస్తున్న పోరాటాలు, రాజకీయంగా అవకాశం వచ్చిన సారి ఓట్లేసి చాటిన వైనాన్ని వివరించారు. తెలంగాణలోని పది జిల్లాల ప్రజలు ఒకే గొంతుకగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని తెలిపారు. దీనిపై ఎన్నో ఉదాహరణలున్నాయని గుర్తు చేశారు. తెలంగాణ సాధన కోసమే వెయ్యి మంది విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, సకల జనులు 42 రోజులు ఉద్యమాన్ని నడిపారని తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఇది వరకుగాని, ఇకముందుగాని ఉండే అవకాశమే లేదన్నారు. ప్రజల ఆకాంక్షలపై గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కోరారు. 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కొనసాగింపుగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలర్ రవిని కూడా కలిసి ప్రజల ఆకాంక్షను వివరించారు. ఢిల్లీ వెళ్లిన వారిలో మంత్రులు డీకే అరుణ, శ్రీధర్‌బాబు, బస్వరాజు సారయ్య, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్ ఆరేపల్లి మోహన్ తదితరులు ఉన్నారు.