కేంద్రం సాయం చేయకున్నా పేదల సంక్షేమం ఆగదు

రాష్ట్రం కోసమే బిజెపితో పోరాటం

తిరుమల వెంకన్నపైనా కుట్ర చేస్తున్నారు: బాబు

కాకినాడ,జూన్‌ 5(జనం సాక్షి ): రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ బీజేపీతో పోరాడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. పవన్‌కల్యాణ్‌ తనపై విమర్శలు చేస్తున్నారని.. బీజేపీతో విభేదించిన దగ్గర నుంచి ఆ విమర్శలు మరింత ఎక్కువయ్యాయన్నారు. ఏపీపై ఎవరైనా కుట్రలు చేస్తే వదిలిపెట్టేది లేదని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జరిగిన నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీపై మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వం ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. చివరికి తిరుమల వెంకన్నపైనా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సహకరించకపోయినా ఏపీ అభివృద్ధి మాత్రం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో వైసీపీ కుమ్మక్కైందని వివరించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.3,500 కోట్లు ఇంకా ఇవ్వలేదని తెలిపారు. ఇక పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు మనల్నే డబ్బు పెట్టమంటున్నారని చెప్పుకొచ్చారు. మన గ్యాస్‌ తీసుకెళ్తున్నవాళ్లు.. నిధులు ఎందుకు ఇవ్వరు? అని నిలదీశారు. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. జీఎస్టీ అమలులో లోపాల వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదన్నారు. అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. రాజకీయాలకతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ పెన్షన్లు, రేషన్‌కార్డులు అందజేస్తున్నామన్నారు. రూ.24వేల కోట్ల రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నానని తెలిపారు. అలాగే కాపులు, బ్రాహ్మణులకు కార్పొరేషన్లు పెట్టామని చెప్పారు. ఇక వైశ్యులకు కార్పొరేషన్‌ పెట్టి రూ.60కోట్లు కేటాయించామన్నారు. అగ్రవర్ణాల పేదలకు ఆర్థికసాయం చేసేందుకు ముందుకెళ్తున్నామని వెల్లడించారు. పేదలందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తానే తీసుకున్నానని తెలియజేశారు. ఇప్పటికే 19లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. వెనుకబడిన వర్గాలే టీడీపీకి బలం అని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతక ముందు కిమ్స్‌ కాలేజీలో స్టాల్స్‌ను చంద్రబాబు సందర్శించారు. అనంతరం 36 యువ జంటలకు చంద్రన్నకానుకను సీఎం అందజేశారు. తప్పుడు దెయ్యాలు కూడా పెన్షన్లు తీసుకున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. పెన్సన్‌ కోసం కాంగ్రెస్‌ దెయ్యం వచ్చేదని, పెన్షన్‌ తీసుకుని మళ్లీ శ్మశానానికి పోయేదని… అలాంటి కాంగ్రెస్‌ దెయ్యాల్ని పూర్తిగా సమాధిలో పూడ్చిపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇంకెప్పుడు అలాంటి దెయ్యాలు రావని ఆయన అన్నారు. అలాంటి దెయ్యాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రావాలని అనుకుంటున్నాయి గానీ, వారి ఆటలు కూడా సాగవని సీఎం అన్నారు.