కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయి
– ఉత్తమ్‌కుమార్
సంగారెడ్డి,మే 19(జనంసాక్షి): కేంద్రంలో నరేంద్రమోదీ,రాష్ట్రంలో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను వంచించారని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జూన్ 1న సంగారెడ్డిలో రాహుల్ గాంధీ బహిరంగ సభ జరగనుందని తెలిపారు. శుక్రవారం ఆయన సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ… కేసీఆర్ మూడేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేవిూ లేదన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా మారిందన్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు ఒక్క పైసా కేటాయించలేదని, గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వానికి పట్టడంలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. కాగా.. జూన్ 1న సంగారెడ్డిలో బహిరంగ సభ అనంతరం రైతులు, నిరుద్యోగులతో రాహూల్ గాంధీ సమావేశ మవుతారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రధానంగా రైతుల సమస్యలపై ప్రజలను చైతన్యం చేస్తామని అన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి వైఖరి సరికాదన్నారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని నిస్సిగ్గుగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని, ఇటీవల జరిగిన రైతుల ఆత్మహత్యలు విూ పాలనలో కాదా ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో ఉందని ఉత్తమ్ మండిపడ్డారు. భూ సేకరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. బీజేపీ తమవి గొప్ప సిద్ధాంతాలంటూ ప్రతి ఇల్లు తిరుగుతూ కాంగ్రెస్ నేతలను ప్రలోభపెడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరతామంటూ బీజేపీ సీనియర్లే తమను సంప్రదిస్తున్నారని ఉత్తమ్ అన్నారు. బిజెపిలో చేరడానికి కాంగ్రెస్ వాళ్లు ఎవరూ సిద్దంగా లేరన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.