కేంద్రానికి 72 గంటల డెడ్‌లైన్‌

తన కొడుకును చంపిన ఉగ్రవాదులను తుడిచేయాలి
కేంద్రం స్పందించకపోతే నేను ప్రతీకర చర్యకు దిగుతా
జవాను ఔరంగజేబ్‌ తండ్రి వ్యాఖ్యలు
జమ్మూకాశ్మీర్‌, జూన్‌15(జ‌నం సాక్షి ) : జవాను ఔరంగజేబ్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి అత్యంత పాశవికంగా కాల్చిచంపడంపై ఆయన తండ్రి నిప్పులు చెరిగారు. కేంద్రానికి 72 గంటల గడువు ఇచ్చారు. ఈలోగా తన కొడుకుని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులలను తుడిచివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. శుక్రవారం విూడియాతో ఆయన మాట్లాడుతూ ‘నా కుమారుడిని పొట్టనపెట్టుకున్న వారిపై నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు భారత ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. 72 గంటల్లోగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే నేనే స్వయంగా జౌరంగజేబ్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా అని తీవ్రస్వరంతో అన్నారు. ఔరంగజేబ్‌ తండ్రి కూడా ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. జమ్మూకశ్మీర్‌లో జవాన్లు దేశం కోసం ప్రాణాలు కోల్పోతుంటే కొందరు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని, వేర్పాటువాదులు పాకిస్థాన్‌ సానుభూతిపరులుగా మారుతున్నారని ఆయన తూర్పారబట్టారు. ‘ఔరంగజేబ్‌ మృతి నా కుటుంబానికి మాత్రమే కాదు. ఆర్మీకి కూడా నష్టమే’ అన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పరిస్థితి మెరుగవుతుందని తాము ఆశించినప్పటికీ కేంద్రం చేసింది పెద్దగా లేదని ఆయన విమర్శించారు. వేర్పాటువాదులను, సమస్యను రాజకీయం చేస్తున్నవారిని కశ్మీర్‌ నుంచి తరిమిగొట్టాలని
డిమాండ్‌ చేశారు. కశ్మీర్‌ లోయలో చురుకుగా ఉన్న అన్ని ఉగ్రవాద సంస్థలపై సైన్యం, భద్రతా ఏజెన్సీలు విరుచుకుపడాలని సూచించారు. ‘మా అబ్బాయి ఔరంగజేబ్‌తో కలిసి ఈద్‌ చేసుకోవాలనుకున్నాం. మా కోరిక తీరకుండానే పోయింది అంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.