కేంద్ర ప్రకటనలు మోసం, కుట్రపూరితం : కోదండరామ్‌

 

హైదరాబాద్‌, నవంబర్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం మోసపూరితమైన ప్రకటనలు చేస్తోందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. మంగళవారం హైరదాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్‌ ఒకటిన టీ జేఏసీ సమావేశం నగరంలోని నోమా ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వ పెద్దలు తోచినట్లుగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ను అసలు చర్చలకే పిలవలేదని ఒకరంటే ఇంకా చర్చల ప్రక్రియ ముగియలేదని మరొకరంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం కొన్ని రోజులు తిరగకముందే సీమాంధ్ర నేతల డబ్బు మూటలకు అమ్ముడుపోయి మాట మార్చిందని ఆరోపించారు. తెలంగాణ సమస్య పరిష్కారానికంటూ కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ సమస్యను మరింత జఠిలం చేసిందన్నారు. తర్వాత సంప్రదింపుల పేరుతో కేంద్రం సమస్యను దాటవేసే ధోరణి ప్రదర్శిస్తుందే తప్ప చిత్తశుద్ధితో పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. డిసెంబర్‌ 22న ధూం ధాం దశాబ్ది, 29న టీఆర్‌ఎస్‌ దీక్ష దివస్‌కు జేఏసీ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టమైన కార్యాచరణ ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. అధిష్టానంపై సాధ్యమైనంత వరకు ఒత్తిడి పెంచాలని, ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉన్న అన్ని దారులను ఉపయోగించుకోవాలని సూచించారు.