కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయమేది : నామా

గల్ఫ్‌ బాధితుల సమస్యల పరిష్కారంలో..
న్యూఢిల్లీ : ఉద్యోగాల పేరిట నకిలీ సంస్థలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. లోక్‌సభలో గల్ఫ్‌ బాధితుల సమస్యలపై నామా పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గల్ఫ్‌ బాధితులకు సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్రాలు ఎందుకు సమన్వయంగా పని చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై వయలార్‌ రవి సమాధానమిస్తూ గల్ఫ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న నకిలీ సంస్థలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. 2010లో 145, 2011లో 212, 2012లో 267 ఫిర్యాదులు వచ్చినట్లు వివరించారు. నకిలీ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే మహిళలకు సంబంధించి కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా రవి చెప్పారు. విదేశాల్లో  ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు దౌత్యాధికారులన సంప్రదించేందుకు ఫోన్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. గల్ఫ్‌ బాధితుల సమస్యలపై ఎంపీ పొన్నం  ప్రభాకర్‌ మాట్లాడుతూ చాలా మంది బాధితులు గల్ఫ్‌ జైళ్లలో మగ్గుతున్నారని, వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని పొన్నం ప్రభుత్వాన్ని కోరారు.