కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకనే గ్రామాభివృద్ధి నిధులు నిలిపివేత సర్పంచ్ ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కే సురేష్
మోమిన్ పేట అక్టోబర్ 18 (జనం సాక్షి)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో ఆ ప్రభావం నిధులు విడుదల చేయకుండా ఆపేస్తూ గ్రామపంచాయతీల నడ్డి విరుస్తున్నారని తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ సర్పంచ్ కొనింటి సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం, ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన గ్రామపంచాయతీ నిధులు మంజూరు కాక అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయిందని ఎద్దేవా చేశారు. పెద్ద గ్రామ పంచాయతీలు ఎలా ఉన్నా ఆదాయ వనరులు అంతగా లేని చిన్న పంచాయతీల్లో కనీసం పారిశుద్ధ్య పనులు కూడా సక్రమంగా చేపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐ, నిర్వహణ (డ్రైవర్, డీజిల్) కయ్యే ఖర్చులు పంచాయతీలకు భారంగా పరిణమించాయని వాపోయారు. పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని,
పనులు చేపట్టే కార్మికులకు గౌరవ వేతనం చెల్లించలేని దుస్థితి నెలకొందని ఆయన అన్నారు. ఆస్తి పన్ను, ఇతర రూపాలలో ఆదాయం సమకూరే పంచాయతీలు ఉన్నా కూడా నిధులు వాడుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని ఆయన చెప్పారు. ఆదాయ వనరులు అంతగా లేని చిన్న గ్రామపంచాయతీల పరిస్థితి కత్తిమీద సాములా మారిందన్నారు. జిల్లాలో మొత్తం 566 గ్రామపంచాయతీ ల్లో చిన్నవి 250 ఉన్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లాలోని గ్రామపంచాయతీలకు ఏటా రూ.129 కోట్లు కెటాయిస్తే, ప్రతినెలా రూ.12 కోట్లు కెటాయించే వారని తెలిపారు. కాగా గత కొన్ని నెలలుగా నిధులు నిలిచిపోవడంతో రోజూవారీ పారిశుద్ధ్య పనుల నిర్వహణ, కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ ఈఎంఐ, కరెంట్ బిల్లులు చెల్లించడంలో, పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు ఉపయోగించే ట్రాక్టర్ డీజిల్ పోయించలేని దుస్థితి నెలకొందని వాపోయారు. హామీ ఇచ్చిన విధంగా అప్పులు తెచ్చి మరీ అభివృద్ధి పనులకోసం ఖర్చు చేసే సర్పంచులు ఎందరో మన రాష్ట్రంలో ఉన్నారని చెప్పారు. వారి మీద పనిభారం, ఒత్తిడి వల్ల చివరకు ఆత్మహత్యలకు చేసుకుంటున్న సంఘటనలు తెలంగాణలోనే అధికంగా ఉన్నాయని ఆయన అన్నారు. గతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు పంచాయతీలుగా మారితే అభివృద్ధి జరుగుతుందని భావించినా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని, పాత పంచాయతీలతో పాటు కొత్తగా ఏర్పాటైన వాటికి నిధుల లేమితో అభివృద్ధి కుంటుపడుతుందని విచారం వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపైకి వచ్చి దేశానికి వెన్నెముక వంటి గ్రామాల కొరకు పంచాయతీ సంఘం నుంచి నిధులు కెటాయించి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సర్పంచుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఆయన అన్నారు.
Attachments area