కేజ్రీవాల్ ఇదేం పద్ధతి ?
అధారాలుంటే ప్రభుత్వానికి ఇవ్వు
మీడియా ముందు అరవడమెందుకు ?
‘నల్లకుబేరుల బండారం’పై కాంగ్రెస్ గరం !
న్యూఢిల్లీ, నవంబర్ 10(జనంసాక్షి) :అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కేజ్రీవాల్ శుక్రవారం నల్లకుబేరుల బండాగారాన్ని బయటపెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి అందజేయాలి కానీ విూడియా ఎదుట ప్రవేశపెట్టడం సరికాదని పేర్కొంది. కొంత మంది వ్యక్తుల ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కేజ్రీవాల్ విూడియాను వాడుకుంటున్నారని ఆరోపించింది. శనివారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ విూడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్‌పై మండిపడ్డారు. ‘ఏవైనా ఆధారాలు ఉంటే ప్రభుత్వానికో, ప్రభుత్వ వర్గాలకో అందజేయాలి. విూడియా ఆరోపణలు చేయడం వల్ల వ్యక్తుల ప్రతిష్ట దెబ్బ తీయడం తప్ప దాని వల్ల వచ్చేదేవిూ లేదు. కేజ్రీవాల్ కొందరిని ప్రతిష్టను మంటలగలింపేందుకే ఇలా చేస్తున్నారని’ విమర్శించారు. కేజ్రీవాల్ వద్ద బలమైన పత్రాలు ఉంటే వాటిని ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. కేంద్ర మంత్రే తనకు స్వయంగా నల్ల కుబేరుల ఆధారాలు అందజేశారన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఆ మంత్రి ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.