కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి మోడీ దూరం.. దూరం!

ఢిల్లీ గురువారం, 12 ఫిబ్రవరి 2015(జ‌నంసాక్షి)

kejriwal modi
ఢిల్లీలో కొత్తగా కొలువుదీరనున్న ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గైర్హాజరు కానున్నారు. ఈ మేరకు ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. గురువారం ఉదయం నరేంద్ర మోడీతో కేజ్రీవాల్ భేటీ అయిన సంగతి తెలిసిందే.
ఈ భేటీపై ఆప్ నేత మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ వారిద్దరి మధ్య చర్చలు సామరస్య పూర్వకంగానే జరిగాయని చెప్పారు. అయితే ఫిబ్రవరి 14వ తేదీన ఆప్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మోడీ హాజరుకావడం లేదన్నారు. ఆ రోజు ప్రధానికి వేరే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందున ఆయన హాజరు కాలేకపోతున్నట్లు కేజ్రీవాల్‌కు పీఎం చెప్పారని సిసోడియా వెల్లడించారు.
ఇదిలావుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు ఆపార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ తాజా ఎన్నికల్లో ఆప్ గెలుపునకు కృషి చేసిన ఆయనకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. అరవింద్ కేజ్రీవాల్తో కలిపి ఆరుగురుతో కలిసి మంత్రివర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.  ప్రస్తుతం కేబినెట్లో ఎవరెవరు ఉంటారనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.
కొత్తగా ఏర్పడే కేబినెట్లో పాత మంత్రులు ముగ్గురికి చోటు లభించే అవకాశం ఉంది. సత్యేంద్ర జైన్, సౌరభ్ భరద్వాజ్ తిరిగి కేబినెట్లోకి వచ్చే అవకాశం ఉంది. రాఖీ బిద్లాన్లు, గిరీశ్ సోనీ, సోమ్నాథ్ భారతీలకు కేబినెట్లో చోటు దక్కకపోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి.