కేటీఆర్ ఇది నీఇల్లే అనుకో!
– కేటీఆర్, ఒమర్ అబ్దుల్లా మధ్య ఆసక్తికర సంభాషణ
హైదరాబాద్, జనవరి17జనంసాక్షి) : కేటీఆర్.. ఇది నీఇల్లే అనుకో.. నువ్వు ఎప్పుడైనా రావొచ్చు అంటూ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌ను ఉద్దేశించి జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.. ఇదేంటి ఆయనకు కేటీఆర్‌కు ఏమిటి సంబంధం అనుకుంటున్నారా.. బుధవారం ఒమర్ అబ్దుల్లా మంచుతో కప్పిఉన్న తన ఇంటిని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ ఎంతో ప్రశాంతతను కలిగిస్తుందని ఉమర్ పోస్టు చేశారు. మంచు అందాల నడుమ ఉన్న ఇంటి ఫొటోను చూడగానే కేటీఆర్‌కు బాగా నచ్చేసినట్లుంది. వెంటనే ఒమర్ ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘ఒకవేళ కోరికలు నెరవేర్చే ఫ్యాక్టరీ గనుక ఉంటే.. నేను ఈ క్షణమే అక్కడ ఉండేవాడిని’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన ఒమర్.. కేటీఆర్‌ను సాదరంగా తన ఇంటికి ఆహ్వానించారు. ‘మా ఇంటిని విూ ఇల్లే అనుకోండి… విూరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇక్కడ ఉండొచ్చు అని ఒమర్ ఆహ్వానం పలికారు. ఇందుకు కేటీఆర్.. ‘ఒమర్ సాబ్ విూ ఆఫర్‌ను నేను సీరియస్‌గానే తీసుకుంటాను మరీ..’ అని నవ్వుతూ బదులిచ్చారు. ఓవైపు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కేటీఆర్ వైసీపీ అధినేత జగన్‌తోనూ ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్.. ఒమర్ మధ్య సంభాషణ తాజాగా ఆసక్తికరంగా మారింది.