కేరళను ముంచెత్తున్న వర్షాలు

కొండచరియలు విరిగిపడి బాలిక మృతి

24కు చేరిన మృతుల సంఖ్య

తిరువనంతపురం,జూన్‌14(జ‌నం సాక్షి): కేరళను ముంచెత్తిన వర్షాలు తగ్గుముఖం పట్టలేదు. వరద తాకిడికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కేరళలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. దీంతో ఉత్తర కేరళ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరి కొన్ని చోట్ల ప్రాపర్టీ ధ్వంసం అయ్యింది. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేరళలో మృతిచెందిన వారి సంఖ్య 24కు చేరుకున్నది. మే 29వ తేదీన రుతుపవనాలు కేరళలో ఎంటర్‌ అయ్యాయి. కోజికోడ్‌లోని తమరెస్సేలో ఓ చిన్నారి కొండచరియలు విరిగిపడడంతో మృతిచెందింది. ఇడుకి, వేనాడ్‌, కోజికోడ్‌ జిల్లాల్లో వర్షాల వల్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కూడా రంగంలోకి దిగింది. కన్నూరు, కోజికోడ్‌, కొట్టాయం, అలప్పుజా జిల్లాల్లో రిలీఫ్‌ క్యాంపులను ఏర్పాటు చేవారు.కోజికోడ్‌, కన్నూర్‌లలో వరద తాకిడికి తొమ్మిదేళ్ల బాలిక మరణించగా, మరో పది మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం జాతీయ విపత్తు నిర్వహణ బలగాలకు చెందిన బృందాలు, రాష్ట్ర బృందాలు కోజికోడ్‌లో గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 22,918 ఎకరాల పంట ధ్వంసమైంది. పంప, మణిమాల, కకత్తార్‌ నదులు పొంగిపొర్లుతున్నాయని అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు తోడు పెనుగాలులు వీస్తుండటంతో చెట్లు నేలకొరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోజికోడ్‌లో కుండపోత కారణంగా వీధుల్లో మోకాలిలోతు నీళ్లు చేరాయి. కాగా, భారీ వర్షాలతో కేరళలో మరణాల సంఖ్య ఇప్పటివరకూ 25కు చేరింది.