కేరళలో దిగొచ్చిన ప్రభుత్వం

పెట్రో ధరలపై సుంకం తగ్గింపునకు ఓకే
తిరువనంతపురం,మే30(జ‌నం సాక్షి):పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రజల్లోని ఆగ్రహం, అసహనానికి కేరళ ప్రభుత్వం దిగొచ్చింది. దేశంలోనే అత్యధికంగా రాష్ట్ర పన్నులు విధిస్తుంది కేరళలోనే. లీటర్‌ పెట్రోల్‌ పై 32.2శాతం, డీజిల్‌ పై 25.58శాతం రాష్ట్ర పన్నులు విధిస్తోంది. ఇది దేశంలోనే అత్యధికం. ఓ వైపు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలతోపాటు.. రాష్ట్ర పన్నులు అధికంగా ఉండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే కేరళలోని పినరయ్‌ ప్రభుత్వం దిగి వచ్చింది. జూన్‌ 1వ తేదీ నుంచి కొత్త పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు చూడబోతున్నారంటూ  కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఇసాక్‌ ప్రకటించారు. ప్రస్తుతం త్రివేండ్రంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.82.61గా ఉంటే.. డీజిల్‌ రూ.75.19గా ఉంది. ఎంత శాతం, ఎంత ధర అనేది మాత్రం వెల్లడించలేదు ఆర్థిక మంత్రి. అధికారులతో చర్చించి ప్రకటిస్తాం అన్నారు. పెట్రోల్‌ పై రూ.4, డీజిల్‌ పై రూ.2 వరకు తగ్గించటానికి రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంత స్వల్పంగా తగ్గిస్తే మాత్రం ఊరుకునేది లేదని కేరళ ప్రజలు అప్పుడే హెచ్చరికలు పంపిస్తున్నారు. పెట్రోల్‌ పై రూ.5, డీజిల్‌ పై రూ.7 అయినా తగ్గించాలని కోరుతున్నారు. లారీ యజమానులు, ట్రావెల్స్‌ సంఘాల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఈ డిమాండ్లను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం రూ.2 నుంచి 4 రూపాయల వరకు మాత్రమే తగ్గింపు ఉంటుందని వెల్లడించింది. ఎంత తగ్గించినా.. జూన్‌ 1వ తేదీ నుంచి కొత్త రేట్లు అయితే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.