కేరళలో పేలుళ్లు..

` ఒకరి మృతి..40 మందికి తీవ్ర గాయలు
` టిఫిన్‌ బాక్సులో ఐఈడీ పేలుడు పదార్థాలు..
` కలమస్సేరీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘటన
` ఆధారాలు సేకరిస్తున్నాం: కేరళ ముఖ్యమంత్రి
` ఇది అనాగరిక చర్య : శశిథరూర్‌
తిరువనంతపురం(జనంసాక్షి): కేరళలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన పేలుళ్లు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు.వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఐఈడీ కారణంగానే కన్వెన్షన్‌ సెంటర్లో ఈ భారీ పేలుడు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కేరళ పోలీసులు వెల్లడిరచారు.’కలమస్సేరీలోని జమ్రా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్లో ఉదయం 9.40కి పేలుడు సంభవించింది. ప్రత్యక్షసాక్షులు చెప్పిన వివరాల ప్రకారం రెండు పేలుళ్లు జరిగినట్లు అంచనా వేస్తున్నాం. భారీ పేలుడు పదార్థం ఐఈడీ కారణంగానే ఇది సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పేలుళ్లకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’ అని కేరళ డీజీపీ షేక్‌ దార్వేశ్‌ సాహెబ్‌ పేర్కొన్నారు. ఇందులో ఉగ్రకోణం ఏమైనా ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. దర్యాప్తు తర్వాతే ఏ విషయమైనా చెప్పగలమన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడిరచారు. ఘటనా స్థలానికి ఎన్‌ఐతోపాటు ఇతర దర్యాప్తు సంస్థలు చేరుకున్నట్లు కేరళ మంత్రులు వీఎన్‌ వాసవన్‌, ఆంటోనీ రాజులు పేర్కొన్నారు.ఈ పేలుళ్లలో సుమారు 40 మంది గాయపడగా.. అందులో 10 మంది 50శాతం కంటే ఎక్కువ కాలిన గాయాలతో చికిత్స తీసుకుంటున్నట్లు కేరళ పోలీసులు వెల్లడిరచారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, ద్వేషపూరిత మెసేజ్‌లు వ్యాప్తి చేయొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేలుళ్ల ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. 14 జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటన అనంతరం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. అక్కడి పరిస్థితులను ఆరా తీశారు. దర్యాప్తు కోసం కేంద్ర దర్యాప్తు బృందాలను పంపించినట్లు చెప్పారు.కన్వెన్షన్‌ సెంటర్లో బాంబు పేలుళ్లకు తానే బాధ్యుడినని పేర్కొంటూ త్రిశూర్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయాడు. కలమస్సేరీలో బాంబు అమర్చింది తానేనని చెప్పినట్లు సమాచారం. దీంతో అతడిని పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. ఆ బాంబు పేలుళ్లకు ఇతడికి నిజంగా సంబంధం ఉందా..? అన్న విషయంపై పోలీసులు ఇంకా ఓ నిర్ధారణకు రాలేదని తెలుస్తోంది.
ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ వేల మంది ఉన్నట్లు సమచారం.ప్రత్యక్ష సాక్షులు మాత్రం కన్వెన్షన్‌ హాల్లో మూడు నుంచి నాలుగు పేలుళ్లు జరిగాయని చెబుతున్నారు. కన్వెన్షన్‌ హాలులో దాదాపు 2,500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడికి చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ప్రార్థన సమయంలో వీరంతా కళ్లు మూసుకొని ఉండగా.. హాలు మధ్యలో భారీ పేలుడు జరిగింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ కన్వెన్షన్‌ సెంటర్‌ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటంతో క్షతగాత్రులను తరలించడంలో కొంత జాప్యం చోటు చేసుకొంది. ఈ పేలుళ్లలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.పేలుళ్లలో గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జి ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధితులను కలమస్సేరీ మెడికల్‌ కాలేజీ, ఎర్నాకులం జనరల్‌ హాస్పిటల్‌, కొట్టాయం మెడికల్‌ కాలేజీలకు తరలిస్తున్నారు.ఈ వరుస పేలుళ్ల ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. ‘’ఇదో దురదృష్టకర ఘటన. దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. ఉన్నతాధికారులు మొత్తం ఎర్నాకులంలో ఉన్నారు. డీజీపీ ఘటనా స్థలానికి వెళుతున్నారు. ఈ ఘటనను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. నేను ఇప్పటికే డీజీపీతో మాట్లాడాను. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు.కలమస్సేరీలో వరుస పేలుళ్లను మతాలకు అతీతంగా అందరూ ఖండిరచాలని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ పిలుపునిచ్చారు. ‘మతపరమైన ప్రార్థనలో బాంబుదాడుల వార్త వినిగ్భ్భ్రాంతికి గురయ్యాను. దీనిని నేను ఖండిస్తున్నాను. సత్వరమే పోలీసులు చర్యలు తీసుకోవాలి. మతపెద్దలు అందరు ఏకమై ఈ అనాగరిక చర్యను ఖండిరచాలి’’ అని అన్నారు.