కేరళ మాజీమంత్రి ఇంటిపై విజిలెన్స్‌ దాడులు

3brk84aకొచ్చి: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎక్సైజ్‌ శాఖ మాజీ మంత్రి కె.బాబు, ఆయన ఇద్దరు కుమార్తెల ఇళ్లపై శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వారి ఇళ్లతో పాటు ఎర్నాకుళం జిల్లాలోని కుబలం ప్రాంతంలో నివసిస్తున్న ఆయన ఇద్దరు స్నేహితులు బాబురామ్‌, మోహన్‌ ఇళ్లలో కూడా విజిలెన్స్‌ అధికారులు సోదాలు చేపట్టారు. వూమెన్‌ చాందీ ఆధ్వర్యంలోని యూడీఎఫ్‌ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా కె.బాబు పనిచేశారు. ఆ సమయంలో బార్‌ కుంభకోణంలో ఆయన ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు రావడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఈ కేసు విచారణలో భాగంగా త్రిపునితురలోని బాబు ఇంటితో పాటు ఇడుక్కి జిల్లాలో ఉన్న ఆయన కుమార్తెల ఇళ్లపై దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఐదు బృందాలుగా అధికారులు సోదాలు చేపట్టారు. ఈ ఏడాది ఎన్నికల్లో త్రిపునితుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాబు విజయం సాధించలేకపోయారు.