కేసీఆర్‌ ఓటు బాట కట్టిపెట్టు పోరు బాట తలపెట్టు

నీ ముందస్తు వ్యాఖ్యలతో
తెలంగాణ ఉద్యమం నీరుగారుతోంది : నారాయణ
హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (జనంసాక్షి):
కేసీఆర్‌ ఓటు బాట కట్టిపెట్టి పోరుబాట తలపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కోరారు. ఆదివారం ఆయన ఇక్కడి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అంశంపై కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ ముందస్తు వ్యాఖ్యలు ఉద్యమాన్ని నీరుస్తున్నాయన్నారు. తెలంగాణ అంశానికి, ఎన్నికలకు ఎటువంటి సంబంధంలేదన్నారు. తెలంగాణ వచ్చాక ఎన్నికలను చూసుకోవచ్చని, మొదట తెలంగాణపై పోరాడాలని హితువు పలికారు. తాను కేసీఆర్‌లా ఎన్నికల కోసం ఎదురు చూడబోమని, తెలంగాణ కోసం ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన అణువిద్యుత్‌ కేంద్ర ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఇక్కడి మీడియాతో మాట్లాడారు. అణువిద్యుత్‌ కేంద్రంపై ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నందుకు తనపై పోలీసులు పెట్టిన కేసులను ఆయన తేలిగ్గా తీసుకున్నారు. కేసులు పెట్టాల్సి వస్తే ముందు రెవెన్యూ, పోలీసు అధికారులపైనే కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రజాభిష్టాన్నికి వ్యతిరేకంగా వద్దని చెబుతున్నా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌చార్జీల పెంపుపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చశారు. విద్యుత్‌ చార్జీల పెంపుపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్‌ అథారిటీ చేపట్టబోయే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుని తీరుతామని ఆయన హెచ్చరించారు.