కేసీఆర్ నిర్ణయాలతో పల్లె ప్రజల్లో ఆనందం
తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే
రైతుబంధుతో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచింది
రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
వికారాబాద్ జిల్లాలో పల్లెబాటలో పాల్గొన్న మంత్రి మహేందర్ రెడ్డి
వికారాబాద్, జూన్7(జనం సాక్షి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబాటుకు గురైన పల్లెలు.. ప్రస్తుతం తెలంగాణ హయాంలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో పల్లె ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లాలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బషీరాబాద్ మండలంలో జరిగిన పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గిరిజన తండాలలో మంత్రి పర్యటించారు. కుప్పన్ కోట్ తండ, బాద్లాపూర్ తండ, గొటిగ కులాన్, బోజ్యానాయక్ తండాలలో ప్రజలతో మమేకమై మహేందర్ రెడ్డి వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. 500 జనాభా గల గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి కొనియాడారు. అనంతరం షీరాబాద్ మండలం గొటిగకుర్దులోని జిల్లా పరిషత్ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాలికలకు మంత్రి మహేందర్ రెడ్డి సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ అబ్రహం, ఎన్ఆర్ఐ డాక్టర్ అంకిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. 200 దేశాల్లో సేవలందిస్తున్న రోటరీ క్లబ్ తెలంగాణలోని ప్రతీ పల్లెకు మౌలిక సదుపాయాలు అందించేందుకు యత్నించాలని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కషి చేస్తుందని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా వంటి అద్భుతమైన పథకాలతో దేశం మొత్తం తెలంగాణవైపే చూస్తుందని అన్నారు. కేసీఆర్ అమలు చేసే పథకాలను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాల మంత్రులు తెలంగాణ వస్తున్నారని, తద్వారా వారి రాష్ట్రాల్లో అమలు పర్చేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో పల్లెల్లో పాలన పడకేసిందని, ప్రత్యేక తెలంగాణ అనంతరం నూతన జిల్లాల ఏర్పాటుతో ప్రతి పేదవానికి, ప్రతి మారుమూల పల్లె ప్రజల వరకు పథకాల ఫలాలు అందుతున్నాయని మంత్రి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో తెరాస నేతలు పాల్గొన్నారు.