కేసీఆర్‌ పచ్చి మోసగాడు 


– డిసెంబర్‌ 12న ప్రజాఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం
– పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
సూర్యాటపే, నవంబర్‌24(జ‌నంసాక్షి) : తెలంగాణ సీఎం కేసీఆర్‌ పచ్చి మోసగాడు అని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన.. ఎన్నికల ప్రచారాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను నెరవేర్చకుండా కేసీఆర్‌  కు ఓటు అడిగే హక్కు లేదని తెలిపారు. మహా కూటమి భయంతోనే  మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. డిసెంబర్‌ 12న ప్రజా ప్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీతో ఒప్పందం మేరకు రాష్ట్రంలో మైనారిటీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. డబల్‌ బెడ్‌ రూమ్‌, దళితులకు 3 ఎకరాల భూమి, మైనారిటీలకు రిజర్వేషన్‌ ఇస్తుంటే చంద్రబాబు అడ్డు పడ్డారా అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది కేసీఆర్‌, కేటీఆర్‌ కాదా అని నిలదీశారు. హుజూర్‌ నగర్‌ నుంచి 50 వేలు మెజారిటీ తో గెలువబోతున్నామని ఉత్తమ్‌ జోస్యం చెప్పారు.  హుజూర్‌ నగర్‌ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హావిూ ఇచ్చారు. మంత్రి జగదీష్‌ రెడ్డి చెంచాలు, బినావిూలుగా
ఉన్న నాయకులు హుజూర్‌ నగర్‌ ని ఏమి అభివృద్ధి  చేశారని  ప్రశ్నించారు.  రాష్ట్రంలో ప్రజాఫ్రంట్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తామని, కుల, మత బేధాలకు తావులేకుండా పాలన సాగిస్తామని అన్నారు. రాహుల్‌ , సోనియాగాంధీల సభ పెద్ద ఎత్తున విజయవంతం అయిందని, కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపిందని అన్నారు.