కేసీఆర్‌ పాలన భేష్‌..

3

– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎమ్మెస్సార్‌

హైదరాబాద్‌,నవంబర్‌13(జనంసాక్షి): తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వ పాలన బాగుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు(ఎమ్మెస్సార్‌) కితాబునిచ్చారు.  గాంధీభవన్‌లో  నిర్వహించిన జవహర్‌లాల్‌ నెహ్రూ 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మిషన్‌ కాకతీయ, గ్రామజ్యోతి లాంటి పథకాలతో ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. విద్యుత్‌ విధానం కూడా బాగుందన్నారు. వరంగల్‌ ఉపఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో అక్కడి ప్రజలు నిర్ణయించుకుంటారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలన్నాక ప్రభుత్వాన్ని ఏదొకటి అనాలి కాబట్టి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఎమ్మెస్సార్‌ అన్నారు.  కేసీఆర్‌ చేసిన మంచి పనులు స్వాగతించాలని కాంగ్రెస్‌ నేతలకు ఎమ్మెస్సార్‌ సూచించారు. ఇతర పార్టీల మాదిరే కాంగ్రెస్‌ నేతలు కూడా కేసీఆర్‌ను విమర్శిస్తున్నారన్నారు. అయితే దూకుడు తగ్గించి అందరినీ కలుపుకుని పోవాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెస్సార్‌ హితవు పలికారు. ఎవరికి ఓటేయాలనేది వరంగల్‌ ప్రజలు నిర్ణయిస్తారన్నారు. బిహార్‌ మాదిరిగానే వరంగల్‌ ప్రజలు కూడా ఫలితాన్నిస్తారని ఎమ్మెస్సార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ పాలన సరిగా లేదని బిహార్‌ ప్రజలు నిరూపించారన్నారు. లోపాలు సరిచేసుకోవడానికి బీజేపీకి బిహార్‌ ఫలితాలు అనుకూలిస్తాయన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం రాహుల్‌ ఓపిక పట్టాలన్నారు.

చాలా కాలం తర్వాత ఆర్టిసీ మాజీ ఛైర్మన్‌ , సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఎమ్మెస్సార్‌ చేసిన వ్యాఖ్యలు ఓ రకంగా కాంగ్రెస్‌కు ఝలక్‌ లాంటివేనని భావించాలి. కెసిఆర్‌ కు అనుకూలంగా ఆయన మాట్లాడుతూనే కొంత దూకుడు తగ్గించాలని  అందరిని కలుపుకుని వెళ్లాలని కూడా సూచించారు. కాంగ్రెస్‌ నేతలు ప్రతిదానిని విమర్శించడం కాకుండా,నిర్మాణాత్మకంగా ఉండాలని అన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ నేతలు ఘాటుగా విమర్శించి కెసిఆర్‌ను ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తుంటే ఎమ్మెస్సార్‌ అందుకు భిన్నంగా స్పందించడం విశేషం.