కేసీఆర్ వల్లే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి
పదవుల కోసం పాకులాడలేదు
ప్రాంతం కోసమే పంతం పట్టాం
రాజీనామాలు చేసి రాష్ట్రాన్ని సాధించాం
పెట్టుబడి పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది
మోతీ ఘనాపూర్‌లో కళ్యాణలక్ష్మీ, రైతు బంధు చెక్కుల పంపిణీ
రెవెన్యూ సదస్సులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి రైతులతో ముఖాముఖి
మహబూబ్ నగర్, జూన్6(జనం సాక్షి) : నాడు ఉద్యమానికి నాయకత్వం వహించిన నేటి సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం మోతీ ఘనాపూర్‌లో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో మంత్రి లక్ష్మారెడ్డి రైతులతో ముఖాముఖి చర్చించారు. కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి రైతులతో మాట్లాడుతూ.. సీఎం సహా తానుసైతం నాడు తెలంగాణ కోసం పదవీ త్యాగాలు చేశామని, పదవుల కోసం పాకులాడలేదని, తెచ్చిన తెలంగాణ తెర్లు కాకుండా, సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. అందులో భాగంగానే అనేక అద్భుత పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన-రైతు బంధు పథకం కింద పంటల పెట్టుబడి చెక్కులు ఎలా ఉందంటూ ప్రశ్నించారు. రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పంటల పెట్టుబడి పథకం దేశంలోనే అదర్శంగా నిలిచిందన్నారు. స్వాతంత్యం అనంతరం ఒక్కసారి కూడా భూప్రక్షాళన జరగలేదన్నారు. గతంలో నిజాం కాలంలో ఒకసారి భూ ప్రక్షాళన జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రతీ పథకం అద్భుతంగా ఉన్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉందన్నారు. అయితే, నాడు తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించిన కేసీఆరే సీఎం అవడం, ఆయనకు రాష్ట్రం మొత్తం సమస్యల విూద అవగాహన ఉండటం వల్ల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. బంగారు తెలంగాణ సాధించి తీరుతామని చెప్పారు. నాడు ఉద్యమం సమయంలో కేసీఆర్ మాట విూద తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశామన్నారు. అలాగే కేసీఆర్ సైతం అనేక సార్లు పదవీ త్యాగం చేశారని చెప్పారు. తామేనాడూ పదవుల కోసం పాకులాడలేదన్నారు. త్యాగాల పునాదుల విూదే తెలంగాణ సాధించామని వివరించారు. అనంతరం మంత్రి కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. భూ ప్రక్షాళన కార్యక్రమంపై రైతులకు వివరించారు. ఇంకా సమస్యలుంటే వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని రైతులకు చెప్పారు. చెక్కులు రాలేదని ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.
గొర్రెలు మృతి: యజమానికి మంత్రి పరామర్శ
బాలానగర్ మండలం మోతీఘనపూర్ లో మంగళవారం రాత్రి టైర్ల కంపెనీ గోడ కూలి 47 గొర్రెలు మృతి చెందాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం గొర్రెల యజమాని గొల్ల చంద్రయ్యను వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. ప్రభుత్వ పరంగా చంద్రయ్యను ఆదుకుంటామని మంత్రి హావిూ ఇచ్చారు. జరిగిన నష్టం విలువను తెలుసుకున్న మంత్రి.. చంద్రయ్యను ఓదార్చారు. చంద్రయ్యకు ప్రభుత్వ పరంగా సాయం అందించేందకు కృషి చేస్తామన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.