కేసీఆర్ హామీలు డబుల్-అమలు డమాల్.
డబుల్ బెడ్ రూమ్ ల హామీని మరిచిన ముఖ్యమంత్రి.
బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్5(జనంసాక్షి):
రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఎన్నికల సమయంలో పేద ప్రజలకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను మరిచిపోయారని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి ఒక ప్రకటనలో తెలిపారు.శనివారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హామీలు డబుల్-అమలు చేయడంలో మాత్రం డమాల్ అని అన్నారు.ఖాళీ స్థలాలు ఉంటే ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అట్టి హామీని విస్మరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.అక్కడక్కడ నిర్మాణ మవుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులు నత్త నడకన నడుస్తున్నాయ ని ఆరోపించారు.రెండో విడత ఎన్నికల సమయంలో ఇంటి స్థలాలు ఉన్న వారికి ఇండ్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని వాటిని కూడా మూడు లక్షలకు తగ్గించి ఇస్తానని ప్రకటన చేసి ఇప్పుడేమో ఐదు లక్షలు లేవు మూడు లక్షలు లేవు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవు అని ఎద్దేవా చేశారు. ఈ సంవత్సరం అధిక మొత్తంలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో అక్కడక్కడ ఇండ్లు కూలిపో యాయని అదే సందర్భంలో కొందరు చనిపోయారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు పైన విచారించింది లేదు పరామర్శించింది లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.కొందరు బాత్రూమ్ లోనే నివసిస్తూ అందులోనే వంట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని,మరికొందరు గుడారాలు,రేకులు వేసుకొని తాత్కాలికంగా నివాసాలు ఉంటున్నారని పత్రికల్లో, టీవీలల్లో వస్తున్నప్పటికి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇండ్లు లేని నిరుపేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వాలని ఖాళీగా ఉన్న స్థలానికి ఇచ్చిన మాట ప్రకారం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డి. అరవింద్ చారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు.