కొచ్చిలో కుప్పకూలిన నేవీ హెలీకాప్టర్‌

Helicopter Crash: కేరళలో పెను ప్రమాదం..  కొచ్చిలో కుప్పకూలిన నేవీ హెలీకాప్టర్‌ ఒకరు మృతి..

ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
కొచ్చి(జనంసాక్షి): భారత నావికాదళానికి చెందిన శిక్షణ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో నేవీ అధికారి ఒకరు దుర్మరణం పాలైనట్టుగా తెలిసింది.. కేరళలోని కొచ్చిలో ఈ హెలికాప్టర్‌ ప్రమాదం జరిగింది. ఇండియన్‌ నేవికి చెందిన చేతక్‌ హెలికాప్టర్‌ కొచ్చిలోని నావికాదళ వైమానిక కేంద్రం ఐఎన్‌ఎస్‌ గరుడ రన్‌ వే పై కుప్పకూలింది. జరిగిన ఘటనలో పైలట్‌ సహా మరో ఇద్దరికి గాయపడ్డారని తెలిసింది. చాపర్‌ రోటర్‌ బ్లేడ్లు తగలడంతో రన్‌వేపై ఉన్న నౌకాదళ అధికారి ఒకరు మృతి చెందినట్లుగా సమాచారం. హెలికాప్టర్‌లో ఉన్న గాయపడ్డ ఇద్దరు సైనికులను హుటా హుటినా ఆస్పత్రికి తరలించారు. చేతక్‌ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో నేవీ అధికారి యోగేంద్ర సింగ్‌ మృతి చెందినట్టుగా తెలిసింది. సౌత్‌ నేవల్‌ కమాండ్‌ హెడ్‌ క్వార్టర్స్‌లోని ఐఎన్‌ఎస్‌ గరుడ రన్‌వేపై రన్‌వేపై ఉండగా హెలికాప్టర్‌ రోటర్‌ బ్లేడ్‌లు తగలడంతో నౌకాదళ అధికారి ఘోరమైన ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌ పైలట్‌తో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని, వారు ప్రస్తుతం నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఉన్న సంజీవని ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారని ప్రాథమిక నివేదికలు సూచించాయి. జరిగిన ప్రమాదాన్ని ధృవీకరిస్తూ, ఇండియన్‌ నేవీ అధికార ప్రతినిధి ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘భారత నావికాదళ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌, భారత నావికాదళ సిబ్బంది జరిగిన ఘటనపై సంతాపం తెలియజేస్తున్నారు. ప్రమాదంలో మరణించిన యోగేంద్ర సింగ్‌కు నివాళులు అర్పించారు. కొచ్చిలో దురదృష్టకర ప్రమాదంపై పలువురు స్పందించారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కొచ్చి హార్బర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.