కొత్త కార్డులకు రెండురోజులే గడువు
జనవరి 1 తర్వాత మాగ్నటిక్ కార్డులు రద్దు
కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్న బ్యాంకులు
హైదరాబాద్,డిసెంబర్29(జనంసాక్షి): కొత్త డెబిట్, క్రెడిట్ కార్డుల జారీకి మరో రెండు రోజుల గడువు మాత్రమే మిగిలివుంది. దీంతో బ్యాంకర్లు ఖాతాదారులకు నేరుగా కార్డులు అందచేస్తున్నారు. గతంలో జారీ చేసిన మాగ్నటిక్ స్టిప్ర్ కలిగిన ఏటీఎం కార్డులతో ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్డులను పూర్తిగా రద్దు చేసి చిప్ కలిగిన కొత్త ఏటీఎం కార్డులను ఖాతాదారులకు అందజేస్తున్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలతో కొత్తకార్డులకు బ్యాంకర్లు శ్రీకారం చుట్టాయి. తరుచూ జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలకు ఆడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు కొనసాగుతున్న ఈఎంవీ చిప్ లేని ఏటీఎం డెబిట్, క్రెడిట్ కార్డులు డిసెంబర్ 31 తర్వాత పని చేయవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు చిప్‌లేని డెబిట్, క్రెడిట్ కార్డులను అందజేశాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏటీఎం కార్డుల క్లోనింగ్ ద్వారా మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల నుంచి ఖాతాదారుల డబ్బును కాపాడేందుకు మాగ్నటిక్ స్టిప్ర్‌తోపాటు అదనంగా ఈఎంవీ చిప్ కలిగిన కార్డులు అవసరమని బ్యాంకింగ్ సంస్థలు భావించాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ ఖాతాదారుల కార్డులు హ్యాక్ కాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. చిప్ కలిగిన ఏటీఎం కార్డుల ద్వారా సమాచారం హ్యాక్ కాకుండా సురక్షితంగా ఉంటుంది. గతంలో బ్యాంకులు జారీ చేసిన మాగ్నటిక్ కార్డుల ద్వారా క్లోనింగ్ చేసి సైబర్ నేరగాళ్లు ఖాతాల నుంచి సులువుగా నగదు దోపిడీకి పాల్పడుతున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. నూతనంగా చిప్‌తో వచ్చిన ఈవీఎం కార్డులను క్లోనింగ్ చేసేందుకు వీలుండదు. ఎందుకంటే ప్రతీ లావాదేవీకి వర్చువల్ కీ జనరేట్ కావడంతో క్లోనింగ్ చేసేందుకు ఆస్కారం ఉండదు. పాత ఏటీఎం కార్డులున్న ఖాతాదారులకు ఆయా బ్యాంకులు వాటి స్థానంలో చిప్ ఉన్న నూతన ఏటీఎం కార్డులను జారీ చేస్తున్నాయి. దీనికి ఎలాంటి దరఖాస్తులు అవసరం లేదని, ఆటోమేటిక్‌గా కార్డులు పోస్టు ద్వారా ఖాతాదారులకు అందిస్తున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అడ్రస్‌లో తప్పులు, ఇతర కారణాలతో నూతన కార్డులు అందని వారు బ్యాంకు అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కాగా, కొన్ని బ్యాంకులు ఉచితంగానే ఏటీఎం కార్డులు అందజేస్తుండగా.. మరికొన్ని బ్యాంకులు రూ.110 నుంచి రూ.150 వరకు తీసుకొని అందజేస్తున్నట్లు పలువురు ఖాతాదారులు ఆరోపిస్తున్నారు.