కొత్త గొర్రెల యూనిట్ల కోసం లబ్దిదారుల ఎదురుచూపు

పంపిణీ పథకం దుర్వినియోగంపై నిఘా
త్వరలోనే మళ్లీ పంపిణీకి చర్యలు
హైదరాబాద్‌,డిసెంబర్‌14(జ‌నంసాక్షి): గొర్రెల పంపిణీ పథకం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు గొర్రెల సంరక్షణపై నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రతీ 15 రోజులకు ఒకసారి తనిఖీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కొత్త యూనిట్లపై ప్రభుత్వం త్వరలోనే  నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు జిల్లాల్లో లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు. గొర్ల కాపర్ల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల యూనిట్ల పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది.. పలు చోట్ల గొర్రెల యూనిట్లను అమ్ముకుంటున్నారనే
సమాచారంతో యంత్రాంగం అప్రమత్తమైంది. గొర్రెల యూనిట్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆయా మండలాల్లోని ఎంపీడీఓలు, తహసీల్దార్‌లకు బాధ్యతలు అప్పగించారు. వీరు ప్రతీ 15 రోజులకు ఒకసారి ఆయా గ్రామాల్లో అందజేసిన గొర్రెల యూనిట్ల పరిస్థితిని తెలుసుకోవడం ద్వారా నిరంతర నిఘా పెట్టనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గొర్రెల సహకార సంఘాల అధ్యక్షులకు అవగాహన కల్పించారు. ఎక్కడైనా దుర్వినియోగం
జరిగితే రెవెన్యూ రికవరీ యాక్టు కింద వడ్డీతో కలిపి సబ్సిడీ సొమ్మును వసూలు చేస్తామని హెచ్చరికలు సైతం జారీ చేశారు. అంతేకుండా సదరు సంఘాలను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని.. అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. సబ్సిడీ కింద వచ్చిన గొర్రెల అమ్మకం.. కొనుగోలు నేరమని పేర్కొంటున్నారు.మొత్తంగా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. గొర్ల కాపర్లలో అవగాహన పెంచుతోంది. అలాగే  సబ్సిడీపై గడ్డివిత్తనాలు ఇచ్చేందుకు కార్యచరణ సిద్ధం చేశారు. గొర్రెలకు సంపూర్ణ రక్షణగొర్రెల యూనిట్ల లబ్ధిదారులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. యూనిట్‌ సొమ్ములో ఇన్సూరెన్స్‌ కూడా తోడై ఉంది. దీంతో ఏ ఒక్క గొర్రె చనిపోయినా దాని స్థానంలో మరో గొర్రెను అందించనున్నారు. అయితే ఈ వివరాలను ఎప్పటికప్పుడు అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గొర్రెల కాపరులకు కూడా ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. ఎవరైనా గొర్ల కాపరులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ లక్ష ఇన్సూరెన్స్‌ సొమ్ము రానుంది. ఇదిలా ఉంటే గొర్రెల సంరక్షణ కోసం పశువైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. లబ్ధిదారుల వద్దకు చేరుకోగానే వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా టీకాలు వేస్తు న్నా రు. అనారోగ్యానికి గురైన వారికి చికిత్సలు చేసి లబ్ధిదారులకు అండగా నిలుస్తున్నారు. గొర్రెల మేతకు అవసరమైన గడ్డి విత్తనాలను 100 శాతం ఉచితంగా అందించేందుకు పశుసంవర్థక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంపై ఇదివరకే గొర్రెల కాపరులకు అవగాహన సైతం కల్పించారు. ఇప్పటికే సంఘాల అధ్యక్షులకు ఈ విషయంపై వివరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇచ్చిన విత్తనాలను ప్రభుత్వ బీడు. పోరంబోకు భూముల్లో వీటిని చల్లుకోవాలని సూచిస్తున్నారు. దీంతో పాటు అటు రైతులకు ఇటు గొర్రెల కాపరులకు ఉపయోగకరంగా ఉండే విధానాలను కూడా రూపొందిస్తున్నారు. ఆసక్తిగల గొర్రెల కాపరులు తమ గ్రామాల్లో ఉన్న పండ్ల తోటల యజమానులతో మాట్లాడుకుంటే సదరు తోటల్లో ఉచితంగా గడ్డి జాతుల విత్తనాలను చల్లుకోవచ్చునని పేర్కొంటున్నారు. తద్వారా గొర్రెలకు మేత లభించడంతోపాటుగా.. గొర్రెల ఎరువుతో  చేనుకు బలం చేకూరుతుందని యంత్రాంగం పేర్కొంటోంది. అంతేకాకుండా లబ్ధిదారులకు రూ.మూడు వేలు ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లు పేర్కొంటున్నారు.  వీటిని అమ్ముకుంటే చర్యలు తీసుకోవాలని గతంలో మంత్రిగా ఉన్న  తలసాని శ్రీనివాసయాదవ్‌  ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు.