కొత్త పంచాయితీల ఏర్పాటులో అధికారులు బిజీ

ఖమ్మం,జూలై31(జ‌నం సాక్షి): ఆగస్టు 2వతేదీ నుంచి నూతన పంచాయతీలుగా ఏర్పడిన గ్రామాల్లో పండుగ వాతావరణంలో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాల్లో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లలో జిల్లా పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన పంచాయతీల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి పాలన ప్రారంభించనున్నారు. అలాగే పాలనకు అనుకూలంగా గుర్తించిన భవనానికి సున్నం వేయడంతో పాటు గ్రామ పంచాయతీ పేరు, మండలం, జిల్లా, రాష్ట్రం, పిన్‌కోడ్‌తో ఆ భవనానికి పేర్లను తెలుగులో రాయిస్తారు. పంచాయితీలకు అవసరమైన నూతన రికార్డుల ప్రారంభంతో పాటు నూతన ఫర్నిచర్‌,అవసరమైన స్టాంపులు సిద్ధం చేశారు. ప్రజలకు తమ గ్రామానికి ఉన్న సరిహద్దులను తెలియజేసేవిధంగగ్రామపటాన్ని అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీల నుంచి నూతనంగా విడిపోయిన గ్రామాలకు జనాభా లెక్కల ప్రకారం ఆస్తులు, అప్పులను పంపకం చేశారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 417 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో 167 ఆవాస గ్రామాలను నూతన పంచాయతీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తంగా ఖమ్మం జిల్లాలోని 20 గ్రావిూణ మండలాల్లో 584 పంచాయతీలు ఉన్నాయి. దేశానికి పట్టుగొమ్మలైన పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పంచాయ వ్యవస్థను పునర్విభజన చేసి నూతనంగా పంచాయితీలను ఏర్పాటు చేశారు. చిన్న పంచాయితీలతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పంచాయతీలు తీవ్రమైన నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురయ్యాయని వివరించారు. నేడు పంచాయతీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కోట్లాది రూపాయలు కేటాయించారని పేర్కొన్నారు. లక్షలాది రూపాయలతో గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడు కాలువలు నిర్మించడం జరిగిందన్నారు.